జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి..ముగ్గురు CRPF జవాన్లకు గాయాలు

జమ్మూ కాశ్మీర్.. భూతల స్వర్గం లాంటి ఈ లోయలో మళ్లీ నెత్తుటి మరకలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. భద్రతా బలగాల పటిష్టమైన భద్రతను ఛేదించుకుని మరీ మెరుపు దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు ఒక భారీ దారుణానికి ఒడిగట్టారు. పట్టపగలు, ఎంతో రద్దీగా ఉండే ప్రాంతంలో నేరుగా CRPF చెక్‌పోస్టుపైనే కాల్పుల వర్షం కురిపించారు.బైక్‌ల మీద వచ్చి పక్కా ప్లాన్‌తో చేసిన ఈ ఉగ్రదాడిలో ముగ్గురు CRPF జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల భీభత్సం మొత్తం అక్కడే ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయింది. ఇది ఏదో ఆకస్మికంగా జరిగిన దాడి కాదు.. చాలా రోజులుగా రెక్కీ నిర్వహించి, భద్రతా బలగాల డ్యూటీ షిఫ్ట్‌లు, వాళ్ల పొజిషన్లు పక్కాగా అంచనా వేసిన తర్వాతే ఉగ్రవాదులు ఈ టార్గెటెడ్ అటాక్ చేసినట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురు ధైర్యవంతులైన జవాన్లు నెత్తురోడుతూ నేలపై పడిపోయారు. ఈ ఉగ్రదాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తోటి జవాన్లు వెంటనే స్పందించి, రక్తపు మడుగులో ఉన్న ఆ ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను అత్యవసర చికిత్స కోసం అనంతనాగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో గాయపడిన భద్రతా సిబ్బందిని రాకేష్ దాస్, సంతోష్ చంద్రు, సోమ్‌వీర్ సింగ్‌గా గుర్తించారు. ఉగ్రవాదులు అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో, రాకేష్ దాస్ ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. సంతోష్ చంద్రుకు ఏకంగా పొత్తికడుపు , వెన్నెముక భాగంలో బుల్లెట్ గాయాలయ్యాయి. మరో జవాన్ సోమ్‌వీర్ సింగ్ ఎడమ చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. స్ట్రెచర్ల మీద వారిని ఆసుపత్రిలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. డాక్టర్లు వెంటనే వారికి అత్యవసర ఆపరేషన్లు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు జవాన్ల పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం లేదని అధికారిక వర్గాలు ప్రకటించడంతో దేశం ఊపిరి పీల్చుకుంది.



