నషా ముక్త్ భారత్ కోసం కదులుతున్న ప్రముఖులు.. డ్రగ్స్ నిర్మూలనకు నాగార్జున ప్రతిజ్ఞ!

మాదకద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడానికి, ఈ విషయంపై యువతలో అవగాహన కల్పించడానికి భారత సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 15న ప్రారంభించిన జాతీయ కార్యక్రమమే ‘నషా ముక్త్ భారత్’. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డ్రగ్స్ కు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 25 నుండి చేపట్టిన ఈ 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర కొనసాగుతోంది. మూడోరోజైన నేడు అమీర్ పేట నుండి మొదలై ఫిల్మ్ నగర్ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా అమీర్‌పేటలో నిర్వహించిన కార్యక్రమంలో సినీ ప్రముఖులు కింగ్ నాగార్జున, బోయపాటి శ్రీను, సాయికుమార్ వంటి ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. ఈ ‘నషా ముక్త్ భారత్’ కోసం హాజరైన వారితో కింగ్ నాగార్జున ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్నారు. నషా ముక్త్ భారత్ సాధ్యం అవుతుందనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. . ముగింపు కార్యక్రమంలో 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ నటుడు చిరంజీవి పాల్గొంటారన్నారు. దేశంలో డీఅడిక్షన్ కేంద్రాల పెంపునకు కేంద్రం కృషి చేస్తోందని వివరించారు. డ్రగ్స్ నిర్మూలనకు పలు దేశాలతో భారత్ ఎంవోయూ కుదుర్చుకుందని విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆధునిక జీవనశైలిలో మాదకద్రవ్యాల వినియోగం ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారి, ముఖ్యంగా భావిభారత పౌరులైన యువత జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. ఏ సమాజమైనా ప్రగతి పథంలో నడవాలంటే, అక్కడి ప్రజలు మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండటం తప్పనిసరి. మత్తుపదార్థాలకు అలవాటు పడిన వారు తమ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి, స్వయంకృతాపరాధాలతో జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా సమాజంలో అశాంతికి కారణమవుతున్నారు. అందుకే, భవిష్యత్ తరాలకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని అందించడానికి ఈ మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించుకోవడం అతి ముఖ్యం.



