న్యూజిలాండ్ తో నాలుగో వన్డేలో భారత్ ఘోర పరాజయం..244 రన్స్ తేడాతో ఓటమి

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 5 వన్డేల సిరీస్ లో భాగంగా తాజాగా జరిగిన నాలుగో వన్డేలో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ సిరీస్ లో మొదటి రెండు వన్డేలలో భారత్ విజయం సాధించగా…మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఇక నేడు మౌంట్ మౌంగనుయ్ లోని బే ఓవల్ వేదికగా జరిగిన 4వ వన్డేలో భారత్ పై న్యూజిలాండ్ 244 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ పై వన్డేల్లో న్యూజిలాండ్ కు ఇదే భారీ విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులు చేసింది. విల్ యంగ్ 125 (108; 14x4, 4x6) సెంచరీతో అలరించాడు. భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ రన్స్ చేశాడు. టిమ్ సెఫర్ట్ 58 (48; 6x4, 3x6) హాఫ్ సెంచరీ చేశాడు. ఫిన్ అలెన్ (41), మిచెల్ శాంట్నర్ (24), క్రిస్టియన్ క్లార్క్ (22) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అక్సర్ పటేల్ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. నమన్ ధీర్, అర్ష్ దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.
ఇక భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు మొదటి ఓవర్ లోనే కీలక బ్యాటర్లు డకౌట్ గా పెవిలియన్ చేరారు. రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లీ (0), శ్రేయాస్ అయ్యర్ (0) భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే ఘోరంగా విఫలమై పెవిలియన్ చేరారు. కొద్దిసేపటికే రుతురాజ్ గైక్వాడ్ (5) కూడా ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ (27), నమన్ ధీర్ (21), అక్సర్ పటేల్ (21) మినహా ఎవరూ రెండెంకెల స్కోర్ చేయలేదంటే భారత్ టాప్ ఆర్డర్ ఏ స్థాయిలో విఫలమైందో చెప్పొచ్చు. 26.4 ఓవర్లలోనే భారత్ 89 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 6 వికెట్లతో రాణించాడు. మ్యాథ్యూ ఫిషర్ 3 వికెట్లు పడగొట్టాడు. కైల్ జేమిసన్ 1 వికెట్ తీశాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత జట్టుకు ఊహించని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలడంతో అభిమానుల నుండి సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక అగ్రశ్రేణి జట్టు ఈస్థాయిలో పరాజయం చెందడంతో నిరాశ చెందారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ విభాగం, ముఖ్యంగా టాప్ ఆర్డర్ కీలక సమయంలో చేతులెత్తేయడంతో జట్టు ఆరంభంలోనే తీవ్ర కష్టాల్లో పడింది. కివీస్ పేసర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసురుతూ భారత స్టార్ బ్యాటర్లను బోల్తా కొట్టించారు. క్రీజులో కుదురుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో భారత్ ఇన్నింగ్స్ స్వల్ప స్కోరుకే ముగిసింది. న్యూజిలాండ్ బౌలింగ్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. వారి పేస్ అటాక్ ముందు భారత బ్యాటర్లు ఏమాత్రం నిలవలేకపోయారు. మిడిల్ ఆర్డర్ సైతం ఆ ఒత్తిడిని తట్టుకుని జట్టును ఆదుకోవడంలో విఫలమవడంతో టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఫలితంగా భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.



