పంటల బీమాపై ఏపీ సీఎం సమీక్ష… ఖరీఫ్‌లో 22, రబీలో 16 రకాల పంటలకు బీమా

ఒకవైపు వరుస తుఫానులు, భారీ వరదలు.. మరోవైపు అనావృష్టితో కరువు పరిస్థితులు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి ఏదో ఒక విపత్తు రూపంలో రైతుల ఆశలు గల్లంతవుతూనే ఉన్నాయి. పంట నష్టపోయిన రైతులు అప్పుల పాలై దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కానీ, ఇలాంటి కష్టకాలంలో అన్నదాతలకు కొండంత అండగా నిలబడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది.
ఏపీ సీఎం చంద్రబాబు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో, పలు బీమా కంపెనీల ప్రతినిధులతో ఈ బీమా కవరేజ్ పైనే డీటెయిల్డ్ గా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే ఏయే పంటలకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుందనే దానిపై అధికారులు ఒక క్లారిటీ ఇచ్చారు. అధికారుల నివేదిక ప్రకారం.. ఏపీలో ఖరీఫ్ సీజన్ లో ఏకంగా 22 రకాల పంటలకు, ఇక రబీ సీజన్ లో 16 రకాల పంటలకు.. మొత్తం 38 రకాల పంటలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో బీమా సౌకర్యం కల్పించినట్టు సీఎంకు వివరించారు.ముఖ్యంగా ఏపీలో రైతులు అత్యధికంగా పెట్టుబడి పెట్టే వాణిజ్య పంటలు అయిన వేరుశనగ, పత్తి, టమోట లాంటి పంటలకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ కల్పించినట్లు బీమా కంపెనీల ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు. గతంలో చాలాసార్లు వాణిజ్య పంటలు నష్టపోతే బీమా కంపెనీలు సరైన పరిహారం ఇవ్వకుండా రైతులను తిప్పుకున్న సంఘటనలు ఉన్నాయి. కానీ ఈసారి అలా జరిగితే సహించేది లేదని, ప్రకృతి విపత్తులు , మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే పంటల బీమా అంచనాలు జరగాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఖరీఫ్, రబీలో కలిపి ఏకంగా 38 రకాల పంటలకు బీమా వర్తించేలా ప్రభుత్వం పక్కా ప్లాన్ చేసింది. అయితే ఇక్కడే చంద్రబాబు రైతులకు డబుల్ బొనాంజా గురించి ప్రస్తావించారు. అదేంటంటే.. కేవలం బీమా కంపెనీల వైపు నుంచి వచ్చే నష్టపరిహారం మాత్రమే కాకుండా, ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ ని నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నామని ఆయన వెల్లడించారు. అంటే రైతుకు అటు ఇన్సూరెన్స్ వస్తుంది, ఇటు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వస్తుంది. దీనివల్ల రైతు అప్పుల పాలు కాకుండా, మరుసటి ఏడాది పంట వేసుకోవడానికి కావాల్సిన పెట్టుబడి అతని చేతిలో ఉంటుంది. అయితే, ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తెచ్చినా, క్షేత్రస్థాయిలో అవి రైతులకు చేరాలంటే అధికారుల పనితీరు చాలా ముఖ్యం. దరఖాస్తుల పేరుతో, సర్వర్ ప్రాబ్లమ్స్ పేరుతో రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటే ఏమాత్రం ఉపేక్షించేది లేదని సీఎం వార్నింగ్ ఇచ్చారు. అన్నదాతలు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అత్యంత సులభంగా పంటల బీమా చేసుకునేలా అధికారులే వారిని ప్రోత్సహించాలని, ప్రతి రైతుకు బీమా వర్తించేలా చూడాలని ముఖ్యమంత్రి కఠిన ఆదేశాలు జారీ చేశారు.
అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రంలోని 16 జిల్లాల్లో సుమారు 4 లక్షల 10 వేల హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు ప్రాథమిక అంచనా. ఇప్పుడు పంటల బీమా రైతులకు కీలకం కానుంది. విపత్తుల సమయాల్లో రైతులకు పంటల బీమా అండగా నిలుస్తుంది. ఖరీఫ్‌లో వరి ఎకరానికి 40 వేలు, కందికి 20 వేలు, మిర్చికి 90 వేలు, మొక్కజొన్నకు 33 వేలు, పసుపుకు 94 వేలు చొప్పున బీమా కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ దాదాపు ముగింపు దశకు చేరుకుంటోంది. కొన్ని చోట్ల పంట చేతికి వస్తుంటే, మరికొన్ని చోట్ల రబీ సీజన్ కు సన్నాహాలు మొదలయ్యాయి. సరిగ్గా ఈ టైమ్ లోనే రైతులను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. గ్రామస్థాయిలో ఉండే వ్యవసాయ అధికారులు, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది నేరుగా రైతుల వద్దకు వెళ్లి ఈ పంటల బీమా ఆవశ్యకతపై, ఈ-క్రాప్ బుకింగ్ పై అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. రైతులు తాము వేసిన పంట నమోదు కాకపోతే భవిష్యత్తులో బీమా వర్తించదని, కాబట్టి టెక్నాలజీని ఉపయోగించి పారదర్శకంగా ప్రతి ఎకరా నమోదు కావాలని అధికారులకు టార్గెట్ ఫిక్స్ చేశారు. బీమా సంస్థలు కూడా కేవలం ప్రీమియంలు వసూలు చేసుకోవడం వరకే పరిమితం కాకుండా.. విపత్తు సమయంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి న్యాయబద్ధంగా పరిహారం చెల్లించాలని, ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చంద్రబాబు కోరారు.



