ప్రసవం తర్వాత మహిళల పరిస్థితిపై ఉపాసన కీలక వ్యాఖ్యలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్యగా అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల అనగానే అందరికీ ఒక పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. ఆమె ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, ముఖం నిండా చిరునవ్వుతో కనిపిస్తుంటుంది. కెరీర్, ఫ్యామిలీ, సేవా కార్యక్రమాలు.. ఇలా అన్నింట్లోనూ యాక్టివ్‌గా ఉండే ఉపాసన జీవితం చూసి అంతా పర్ఫెక్ట్గా ఉందని అందరూ అనుకుంటారు. కానీ ఆ చిరునవ్వు వెనుక తాను అనుభవించిన శారీరక బాధ, మానసిక సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉన్నాయో తాజాగా ఆమె బహిరంగ వేదికపైనే బయటపెట్టింది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో జరిగిన అపోలో హాస్పిటల్ ఈవెంట్లో పాల్గొన్న ఉపాసన.. తన మాతృత్వ అనుభవాలను పంచుకుంది. రెండోసారి కవలలకు జన్మనిచ్చిన తర్వాత తనకు ఎదురైన విపత్కర అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది.
ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే తల్లికి మళ్లీ ప్రాణం వచ్చినట్లే అంటారు. తొలి ప్రెగ్నెన్సీ సమయంలో ఉపాసనకు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ రెండోసారి గర్భం దాల్చి, కవలలకు జన్మనిచ్చిన తర్వాత ఆమె శారీరకంగా, మానసికంగా ఎన్నో జటిలమైన సమస్యలు ఎదుర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆమె అపోలో హాస్పిటల్స్ వేదికగా పంచుకున్నారు. కవలలు పుట్టిన తర్వాత నా శరీరం, నా మనసు ఎంతో స్ట్రగుల్ అయ్యాయి. ఆ బాధల నుంచి నేను ఇప్పుడిప్పుడే మెల్లగా కోలుకుంటున్నాను అంటూ ఉపాసన భావోద్వేగానికి గురయ్యారు. తన ముఖంపై నిత్యం కనిపించే చిరునవ్వు వెనుక, ఇంకా కోలుకుంటున్న ఒక బాధిత తల్లి ఉందని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ అనుభవం గురించి పూర్తిగా, స్పష్టంగా మాట్లాడేంత మానసిక స్థైర్యం కూడా ఇంకా తనకు రాలేదని ఆమె పేర్కొనడం.. ప్రసవానంతరం ఒక మహిళ పడే వేదనకు అద్దం పడుతోంది. పైకి కోటీశ్వరులైనా, సెలబ్రిటీలైనా సరే ఒక తల్లిగా పడే జన్మవేదన అందరికీ ఒకటేనని ఉపాసన మాటలు నిరూపించాయి. సమాజంలో గర్భం దాల్చేందుకు ఎంతోమంది మహిళలు ఏళ్ల తరబడి పోరాటం చేస్తుంటారు. ఈ క్రమంలో వారు ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లను ఉపాసన ప్రత్యేకంగా ప్రస్తావించారు. నెలసరి ఆలస్యమైతే ఒక మహిళలో ఆశలు ఎలా చిగురిస్తాయో, మళ్లీ నెలసరి వస్తే ఆమె ఎంత తీవ్ర నిరాశకు, డిప్రెషన్‌కు గురవుతుందో ఉపాసన ఎంతో ఆర్ద్రతతో వివరించారు. సహజంగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించినా, లేదా ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లు తీసుకున్నా.. మహిళల భావోద్వేగాలు అన్నీ ఒకేలా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. సమాజం, కుటుంబ సభ్యులు కేవలం పిల్లలు పుట్టారా లేదా అన్నదే కాకుండా, ఆ ప్రయాణంలో మహిళల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. బిడ్డ పుట్టే వరకు ఒక ఎత్తైతే, పుట్టిన తర్వాత ఎదురయ్యే సవాళ్లు మరో ఎత్తు అని ఆమె తన సొంత అనుభవంతో స్పష్టం చేశారు.



