ఫ్లాపుల్లో ఉన్నా తగ్గని క్రేజ్.. ఐకాన్ స్టార్ తో పాన్ ఇండియా మూవీ

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్‌కు వరుసగా రెండు ఫ్లాపులొస్తే..ఆమెను ఐరన్ లెగ్ అని ముద్రవేసి పక్కన పెట్టేస్తారు. కానీ ఒక హీరోయిన్‌కు మాత్రం సక్సెస్ అనే పదం విని ఏళ్లు గడిచిపోతున్నా, బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాపులు వెంటాడుతున్నా.. ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో మాత్రం ఆమెకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమే టాలీవుడ్ లో బుట్టబొమ్మగా అభిమానుల మనసు దోచుకున్న పూజా హెగ్డే . మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్.. ఇలా తెలుగు భారీ స్టార్ హీరోల సరసన నటించి ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన పూజాకు, గత కొంతకాలంగా టైమ్ అస్సలు కలిసిరావడం లేదు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ఎక్కడ అడుగుపెట్టినా ఆమెకు నిరాశే ఎదురైంది. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాతో ఒక భారీ జాక్‌పాట్ తగిలినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో బన్నీ, పూజా కాంబినేషన్లో వచ్చిన అల వైకుంఠపురములో భారీ హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా పూజా హెగ్డే పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ సినిమా గనక సెట్స్ పైకి వెళితే, అల వైకుంఠపురములో తర్వాత మరోసారి బన్నీతో జతకట్టడం ద్వారా పూజా సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని ఆమె ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. బాక్సాఫీస్ హిట్స్ లేకపోయినా, పూజా హెగ్డే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనడానికి రీసెంట్గా జరిగిన ఒక ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. దళపతి విజయ్‌తో ఆమె నటించిన బీస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా, అందులో ఆమె చేసిన అరబిక్ కుత్తు సాంగ్ మాత్రం ఆమెకు ఖండాంతరాల గుర్తింపు తెచ్చిపెట్టింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినా ఫలితం దక్కలేదు కానీ, ఆ బీస్ట్ మ్యాజిక్ మాత్రం ఆమెను వదలలేదు. ఇటీవల శ్రీలంకలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు పూజా హెగ్డే చీఫ్ గెస్ట్‌గా వెళ్లింది. ఆమె వస్తుందన్న వార్త తెలుసుకుని వేలాది మంది దళపతి విజయ్ ఫ్యాన్స్ అక్కడకు పోటెత్తారు. పూజాకు ఘనస్వాగతం పలికిన సిలోన్ ప్రజలు, ఆమెను చూడగానే కేకలతో హోరెత్తించారు. స్టేజ్ మీదకు వెళ్లిన పూజా అభిమానుల కోరిక మేరకు అరబిక్ కుత్తు పాటకు లైవ్‌లో స్టెప్పులేసి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. హిట్లు లేకున్నా గ్లామర్ ఫీల్డ్‌లో పూజాకున్న ఫాలోయింగ్ ఏమాత్రం చెక్కుచెదరలేదని ఆ ఈవెంట్ చూస్తే అర్థమవుతుంది.



