ఒకవైపు దుర్భర పరిస్థితులు…మరొక వైపు అంతరిక్ష కలలు..పాక్ చూపు అటువైపు

భారత్ అనేక రంగాల్లో స్వావలంబన దిశగా దూసుకుపోతోంది. అగ్రరాజ్యాలను సైతం వెనుకకు నెడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. గత కొన్నేళ్లుగా అంతరిక్ష రంగంలో అయితే భారత్ స్పీడ్ రాకెట్ మాదిరి దూసుకుపోతున్న తీరును అభివృద్ధి చెందిన దేశాలు కూడా నోరెళ్ల బెట్టి చూస్తున్నాయి. కాగా, అంతరిక్ష సంస్థ ఇస్రో సాధిస్తున్న అద్భుత విజయాలను చూసి దశాబ్దాలుగా దాయాది పాకిస్థాన్ కుళ్లుకుంటూనే ఉంది. ఒకవైపు దేశంలో దుర్భర పరిస్థితులతో అక్కడి సామాన్య పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక సాయం కోసం పాక్ ప్రపంచ దేశాల వైపు చూస్తూనే ఉంది. ఇప్పుడు అంతరిక్ష కలలు కంటోంది. తమ సొంత పరిజ్ఞానంతో రాకెట్లు పంపే సత్తా లేకపోవడంతో, ఆసియాలో ఇండియాకు బద్ధ శత్రువైన చైనా పంచన చేరింది పాకిస్థాన్. చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది షెన్‌జౌ-24 స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా ఒక పాకిస్థాన్ వ్యోమగామి భూకక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నాడు. అక్కడ కొంతకాలం ఉండి, ఆ తర్వాత పాత షెన్‌జౌ-23 క్యాప్సూల్ ద్వారా తిరిగి భూమికి చేరుకుంటాడు. దీనికోసం పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులు, ముహమ్మద్ జీషాన్ అలీ , ఖుర్రం దావూద్ బీజింగ్‌లోని చైనా ఆస్ట్రోనాట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. చైనా వ్యోమగాములతో కలిసి ఆపరేషనల్ ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా, కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా చైనీస్ భాషను కూడా వీరు నేర్చుకున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసి పేలోడ్ స్పెషలిస్ట్ గా అంతరిక్షంలోకి పంపనున్నారు. చైనా మ్యాన్డ్ స్పేస్ ప్రోగ్రామ్ చరిత్రలో, ఒక విదేశీయుడిని తమ స్పేస్ స్టేషన్ కు తీసుకెళ్లడం ఇదే తొలిసారి. 2025 ఫిబ్రవరిలో చైనా-పాక్ మధ్య కుదిరిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంతరిక్ష ఒప్పందంలో భాగంగానే ఈ మిషన్ జరుగుతోంది.



