బంగ్లాదేశ్ డబుల్ గేమ్..స్వదేశంలో దాడులు..భారత్కు నీతులు

బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అక్కడి స్టూడెంట్ సంఘాలు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థి నేతలు ఇప్పుడు అక్కడ నేషనల్ సిటిజన్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే, సొంత దేశంలో శాంతిభద్రతలను గాడిలో పెట్టాల్సిన ఈ యువ నేతలు.. ఇప్పుడు పొరుగు దేశమైన భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్లో ఎన్నికల జవాబుదారీతనం కోరుతూ ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలకు బంగ్లాదేశ్ ఎన్సీపీ కన్వీనర్ నాహిద్ ఇస్లాం బహిరంగంగా మద్దతు పలకడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత యువతకు, నిరసనకారులకు అండగా ఉంటామని ఆయన ప్రకటించారు. అయితే, గతంలో ఇదే పార్టీకి చెందిన నేతలు భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమిస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సీజేపీ నిరసనలకు మద్దతు తెలపడం వెనుక ఉన్న కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీ హక్కుల గురించి భారత్కు నీతులు చెబుతున్న బంగ్లాదేశ్లో వాస్తవ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది.
కొద్దిరోజులుగా ఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ, ఓటరు జాబితాల సవరణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ పరిణామాలపై బంగ్లాదేశ్ ఎన్సీపీ కన్వీనర్ నాహిద్ ఇస్లాం ఢాకాలో ఒక సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల జవాబుదారీతనం, తమ ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న భారతీయ యువతకు మేము అండగా నిలుస్తున్నాం. ఢిల్లీలో శాంతియుత నిరసనకారులను, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ నిలిపివేయడం ప్రాథమిక స్వేచ్ఛకు ముప్పు అని నాహిద్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్లో జూలై 2024లో కోటాలకు వ్యతిరేకంగా తాము చేసిన ఉద్యమాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. జేఎన్యూ , జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాట స్ఫూర్తిని, షాహీన్ బాగ్ మహిళల ధైర్యాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే జైలులో ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ లాంటి వారిని తమ మిత్రులుగా భావిస్తున్నామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

