బంగ్లాదేశ్‌లో మళ్లీ మొదలైన హింస.. షేక్ హసీనా రీఎంట్రీతో డిసెంబర్ లో అక్కడ ఏం జరగనుంది?

బంగ్లాదేశ్ లో మరోసారి ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. 2024 ఆగస్టు నెలలో జరిగిన హింసాత్మక విద్యార్థి ఉద్యమం తర్వాత బంగ్లాదేశ్ ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతోంది అనుకుంటున్న సమయంలో మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దేశాన్ని వదిలిపెట్టి ఇండియాకు పారిపోయి వచ్చి తలదాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన స్వదేశానికి వెళ్లేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఆ దేశంలో మంటలు రేపుతున్నాయి.తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో వరుసగా రెండు నాటు బాంబులు పేలడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఔటర్ గేట్ సమీపంలో ఒక నాటు బాంబు , విమానాశ్రయానికి దగ్గర్లోని జసిముద్దీన్ ఏరియాలోని ఫ్లైఓవర్ కనెక్టర్ల వద్ద మరో నాటు బాంబు భారీ శబ్దంతో పేలాయి. ఈ ఊహించని బాంబు దాడులతో అక్కడున్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్-ఛార్జ్ కమ్రుల్ ఇస్లాం తాలూక్దార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బాంబులను గుర్తుతెలియని దుండగులు ఫ్లైఓవర్ పైనుంచి కిందకు విసిరారు. ఈ పేలుళ్లలో ముగ్గురు బాటసారులకు గాయాలయ్యాయి. ఈ దాడులు ఎవరు చేశారు అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల భద్రతను అమాంతం పెంచేశారు. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమే అని, రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ లో భారీ స్థాయి హింస చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనికంతటికీ కారణం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ నెలలో మళ్లీ వస్తుందన్న వార్తలే అని తెలుస్తోంది. ఆగస్టు 2024లో జరిగిన స్టూడెంట్స్ ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చిన షేక్ హసీనా.. ఇప్పటికీ న్యూఢిల్లీలోనే తలదాచుకుంటున్నారు. బంగ్లాదేశ్ లోని ఒక స్పెషల్ ట్రిబ్యునల్ హసీనాకు ఉరిశిక్ష వేసే దిశగా కేసులు నడుపుతోంది. అంతేకాదు, ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ ను కూడా కోరింది.అయితే ఇవేవీ పట్టించుకోని హసీనా.. తన రాకను కన్ఫర్మ్ చేసేలా న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు తన న్యాయవాది ద్వారా ఒక ఈమెయిల్ పంపారు. తనకు కొత్త పాస్‌పోర్ట్ , నేషనల్ ఐడెంటిటీ కార్డ్ జారీ చేయాలని అందులో కోరారు. ఇది చూస్తుంటే ఆమె పక్కా ప్లానింగ్ తో డిసెంబర్ నెలలో తన సొంత దేశంలో మళ్లీ కాలుపెట్టబోతున్నారని అర్థమవుతోంది. ఇక బంగ్లాదేశ్ అంతటా రైళ్లు, బస్సులు, బ్యాంకులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ కార్యకర్తలే ఈ విధ్వంసానికి పాల్పడుతున్నారని అక్కడి ప్రభుత్వం ఆరోపిస్తోంది. హసీనా రీ-ఎంట్రీ వార్తలతో బంగ్లాదేశ్ భద్రతా దళాలు అత్యంత అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా షేక్ హసీనా స్వస్థలం, అవామీ లీగ్ కు కంచుకోట లాంటి గోపాల్‌గంజ్ జిల్లాలో ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో గోపాల్‌గంజ్‌లో పలు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఏదైనా విధ్వంసం జరగొచ్చన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా.. గోపాల్‌గంజ్, షరియత్‌పూర్, మదారీపూర్, ఫరీద్పూర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఒకవేళ నిజంగానే షేక్ హసీనా బంగ్లాదేశ్ కు తిరిగి వెళితే ఎటువంటి పరిస్థితులు నెలకొననున్నాయో వేచి చూడాలి.



