మంత్రి అయినా రూల్స్ ఒక్కటే.. అమెరికా సైనికుడి ధైర్యానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
రాజకీయ నాయకులకు పవర్ ఉండొచ్చు, ఉన్నతాధికారులకు హోదా ఉండొచ్చు.. కానీ అమరవీరుల త్యాగాల ముందు ఆ పవర్, హోదా దేనికీ పనికిరావని ఈ అమెరికా సైనికుడు నిరూపించాడు. అగ్రరాజ్యం అమెరికా రక్షణ శాఖ మంత్రికి, ఒక సామాన్య కాపలా సైనికుడు ఏకంగా గన్ ఎత్తి చూపిస్తూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. వెటరన్స్ డే సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మారక స్థలాన్ని సందర్శించడానికి వెళ్లిన మంత్రి .. అక్కడ తన హోదాను అడ్డం పెట్టుకుని క్యాజువల్‌గా ఫొటోలు దిగడం, నవ్వుతూ మాట్లాడటం ఆ సైనికుడికి అస్సలు నచ్చలేదు. దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరుల ముందు ఏంటి ఈ పని అంటూ ఏకంగా మంత్రి బృందానికే వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని ఆర్లింగ్టన్లో ఉన్న టూంబ్ ఆఫ్ ద అన్నోన్ సోల్జర్ అనేది ఒక పవిత్రమైన స్మారకస్థలి. సైనికుల త్యాగాలకు గుర్తుగా ఏర్పాటు చేసుకున్న ఈ ప్రదేశాన్ని రాజకీయ నేతలు సందర్శించడం, నివాళులు అర్పించడం ఆనవాయితీ. వెటరన్స్ డే సందర్భంగా అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెథ్ , ఆయన భార్య జెన్నిఫర్, మిలటరీ ఉన్నతాధికారి రికీ బూరియా, డిప్యూటీ ప్యాట్రిక్ వీవర్, మరియు సీనియర్ సలహాదారు టామా రాడాబాగ్ల బృందం అక్కడికి వెళ్లారు. నివాళులు అర్పించే ఉద్దేశంతోనే వెళ్లినప్పటికీ, ఆ తర్వాత వీరు ఆ స్మారకస్థలి మెట్లపై నిలబడి ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టారట. గుంపుగా నిలబడి, సింగిల్‌గా, ఇతరులతో కలిసి.. ఇలా రకరకాలుగా ఫొటోలు తీసుకుంటూండగా వారి మధ్య మాటలు పెరిగాయి. వారిలో కొందరు జోకేశారో ఏమో.. బిగ్గరగా నవ్వడం ప్రారంభించారు. ఒక పవిత్రమైన స్మారకం ముందు, కనీస సైలెన్స్ మెయిన్‌టెయిన్ చేయకుండా ఆ బృందం గట్టిగా నవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. దేశ రక్షణ మంత్రి, ఆయన సిబ్బంది అలా ప్రవర్తించడం అక్కడున్న వారిని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.



