మెగావర్స్ షూటింగ్ షురూ..అన్‌స్టాపబుల్ రికార్డులు బద్దలవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు. అయితే ఒక రాజకీయ నాయకుడిగా, టెలివిజన్ హోస్ట్‌గా కూడా చిరంజీవి తన మార్క్ చూపించారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్టింగ్ చేసి, తనదైన స్టైల్, గ్రేస్ తో బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే మ్యాజిక్ ను ఓటీటీలో రిపీట్ చేయడానికి మెగాస్టార్ సిద్ధమైపోయారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు బాలయ్య రూట్లోనే చిరంజీవి కూడా ఒక సరికొత్త టాక్ షోతో ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా సైలెంట్ గా మొదలైపోయింది.
గత కొంతకాలంగా ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కోసం చిరంజీవి ఒక భారీ టాక్ షో చేయబోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న ఈ మెగా టాక్ షోకి మెగావర్స్ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడం వెనుక ప్రముఖ రచయిత బీవీఎస్ రవి పాత్ర ఎంతో ఉంది. ఆ షోలో బాలయ్య టైమింగ్, పంచ్ డైలాగులు అన్నీ బీవీఎస్ రవి కలం నుంచి జాలువారినవే. ఇప్పుడు అదే బీవీఎస్ రవి, చిరంజీవి మెగావర్స్ టాక్ షో కోసం ప్రధాన రచయితగా పనిచేస్తున్నారు. అన్‌స్టాపబుల్ తరహాలోనే ఇందులో కూడా ఫన్, ఎమోషన్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ పక్కాగా బ్యాలెన్స్ అయ్యేలా ఈ షో స్క్రిప్ట్ ను డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ షోలో చిరంజీవి తన సుదీర్ఘ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర, అన్‌టోల్డ్ సంగతులను ప్రేక్షకులతో పంచుకోనున్నారు.



