18 ఏళ్ల కుర్రాడి టెక్ మ్యాజిక్.. 6.8 లక్షల PDFల నుంచి అద్భుతమైన ఓటర్ల డేటాబేస్!

లక్షల కొద్దీ పీడీఎఫ్ ఫైళ్లలో చిక్కుకుపోయిన కోట్లాది మంది ఓటర్ల వివరాలను కేవలం ఒక్క క్లిక్‌తో వెతుక్కునేలా ఓ అద్భుతమైన డేటాబేస్ రూపొందించి ఒక 18 ఏళ్ల కుర్రాడు అందరినీ ఆశ్చర్యపరిచి ప్రతిభకు వయసుతో పనిలేదని, బలమైన సంకల్పం, సాంకేతిక నైపుణ్యం ఉంటే పెద్దపెద్ద వ్యవస్థలు సైతం చేయలేని అద్భుతాలను ఒక్క వ్యక్తి సునాయాసంగా చేయగలడని మరోసారి నిరూపించాడు. ఈసీ కూడా చేయలేని ఒక భారీ పనిని ఈ కుర్రాడు చాలా ఈజీగా చేసి చూపించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడి పేరే సార్థక్ సిద్ధాంత్. ఇంతకు ముందు కూడా సీబీఎస్ఈ మార్కింగ్ విధానంలో ఉన్న లోపాలను కచ్చితమైన ఆధారాలతో ఎత్తిచూపి, అప్పట్లో దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు సిద్ధాంత్. సాధారణంగా ఓటర్ల జాబితాలో పేరు వెతుక్కోవడం వేలాది, లక్షలాది విడివిడి పీడీఎఫ్ ఫైళ్లను డౌన్లోడ్ చేసుకుని, అందులో పేర్లను వెతకడం సామాన్యులకు దాదాపు అసాధ్యం. సరిగ్గా ఈ సమస్యకే అద్భుతమైన పరిష్కారాన్ని చూపాడు సాక్ సిద్ధాంత్.
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా, ఓటర్ల జాబితాలను ఎవరైనా ఎంతో సులభంగా సెర్చ్ చేసుకునేలా ఒక సమగ్రమైన డేటాబేస్‌ను సిద్ధాంత్ రూపొందించాడు. ఇక్కడ అతడు ప్రాసెస్ చేసిన డేటా పరిమాణం వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. 2024 లోక్‌సభ ఎన్నికల ఓటర్ల జాబితాలు, ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలు, తుది జాబితాలు, అలాగే 2027 ముసాయిదా ఓటర్ల జాబితాలకు చెందిన ఏకంగా 6 లక్షల 80 వేల పీడీఎఫ్ ఫైళ్లను సిద్ధాంత్ పూర్తిగా డిజిటలైజ్ చేశాడు. వీటన్నింటినీ డిజిటలైజ్ చేయడం ద్వారా దాదాపు 54 కోట్ల 80 లక్షల ఓటర్ల రికార్డులను ఒకే వేదికపైకి తీసుకొచ్చాడు ఈ పద్దెనిమిదేళ్ల కుర్రాడు. అంటే వేర్వేరు జాబితాల్లో ఉన్న కోట్లాది మంది ఓటర్ల వివరాలను గంటల తరబడి పీడీఎఫ్‌లు తిరగేసే అవసరం లేకుండా, ఒకే చోట సులభంగా సెర్చ్ చేసుకునే వెసులుబాటును కల్పించాడన్నమాట.
ప్రజాస్వామ్యంలో ఓటర్ల జాబితా పారదర్శకత అనేది అత్యంత కీలకం. అలాంటి కీలకమైన సమాచారం ప్రజలకు, పరిశోధకులకు సులభంగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక పద్దెనిమిదేళ్ల యువకుడు ఇంత పెద్ద స్థాయిలో డేటాను క్రోడీకరించడం నిజంగా ప్రశంసనీయం. నేటి భారత యువత చేతిలో టెక్నాలజీ ఉంటే సమాజానికి ఎంతటి మేలు చేయగలరో చెప్పడానికి సాక్ సిద్ధాంత్ ఒక అద్భుతమైన ఉదాహరణ. అప్పుడు సీబీఎస్ఈ మార్కింగ్ విధానంలోని లోపాలను ఎత్తిచూపడమైనా, ఇప్పుడు 54 కోట్ల ఓటర్ల రికార్డులను ఒకే వేదికపైకి తీసుకురావడమైనా.. సామాజిక స్పృహతో కూడిన అతడి ప్రతిభకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.



