అమెరికాలో భారత్ పవర్…‘దీపావళి డే యాక్ట్’..!

దీపావళి భారతీయులు జరుపుకునే పెద్ద పండుగలలో ఒకటి. అయితే ఒకప్పుడు కేవలం మన భారతదేశానికే పరిమితమైన పండుగ ఇప్పుడు ఇది ఖండాంతరాలు దాటి గ్లోబల్ ఫెస్టివల్‌గా మారిపోయింది. ఆస్ట్రేలియా నుంచి మొదలుపెట్టి లండన్ మీదుగా అమెరికా వరకు.. ఎక్కడ చూసినా ఇప్పుడు దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మన భారతీయులు ఎక్కడికి వెళ్లినా మన సంస్కృతిని, మన పండుగలను తమతో పాటే తీసుకెళ్లి ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అమెరికాలో దీపావళి పండుగకు ఏకంగా అధికారిక జాతీయ సెలవుదినం హోదా కల్పించేందుకు ప్రతినిధుల సభలో ఒక చారిత్రక బిల్లును ప్రవేశపెట్టారు. అదే దీపావళి డే యాక్ట్ .
కాంగ్రెషనల్ ఏషియన్ పసిఫిక్ అమెరికన్ కాకస్ చైర్‌పర్సన్‌గా ఉన్న యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధి గ్రేస్ మెంగ్ ఈ ప్రతిష్టాత్మక దీపావళి డే యాక్ట్ బిల్లును ప్రతినిధుల సభలో అధికారికంగా ప్రవేశపెట్టారు. న్యూయార్క్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రేస్ మెంగ్.. ఏషియన్ అమెరికన్ల హక్కుల కోసం తీవ్రంగా పోరాడే నాయకురాలిగా గుర్తింపు పొందారు. అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు ఈ దీపావళి అత్యంత పవిత్రమైన పండుగ. వారి సంస్కృతిని, వారి విశ్వాసాలను అమెరికా చట్టబద్ధంగా గౌరవించాలని ఈ బిల్లు కోరుతోంది. ఒకవేళ ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపి, అధ్యక్షుడు గనక సంతకం చేస్తే.. అమెరికా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. క్రిస్మస్, థాంక్స్ గివింగ్, ఇండిపెండెన్స్ డే లాంటి ఫెడరల్ సెలవుదినాల సరసన చేరి.. దీపావళి అమెరికాలో 12వ అధికారిక ఫెడరల్ సెలవుదినంగా చారిత్రక గుర్తింపు పొందుతుంది. ఈ బిల్లు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టగానే దానికి ఊహించని స్థాయిలో మద్దతు లభించింది. ముఖ్యంగా అమెరికా చట్టసభల్లో తమ వాయిస్‌తో సంచలనాలు సృష్టిస్తున్న ఐదుగురు ప్రముఖ భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు ఈ బిల్లుకు పూర్తి మద్దతుగా నిలిచారు. రాజా కృష్ణమూర్తి, సుహాస్ సుబ్రమణ్యం, శ్రీ థానేదార్, రో ఖన్నా , అమీ బేరా ఈ దీపావళి యాక్ట్‌కు మద్దతుగా నిలిచారు. వీరితో పాటు మొత్తం 19 మంది కాంగ్రెస్ సభ్యులు ఈ బిల్లుకు సహ-మద్దతుదారులుగా అధికారికంగా సంతకాలు చేశారు. అమెరికా చట్టసభల్లో ఇప్పుడు భారతీయుల ప్రాబల్యం ఎంత బలంగా ఉందో, వారు తలుచుకుంటే ఏమైనా సాధించగలరు అనడానికి ఈ 19 మంది మద్దతే ఒక అతిపెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది.



