గల్ఫ్ రాజ్యంలో అసలేం జరుగుతోంది? సౌదీ ఒంటరి పోరాటం…హౌతీల దాడులతో బెంబేలు
కామెంట్లు (0)

లక్షల కోట్ల రూపాయల సైనిక సంపద ఉన్న సౌదీ అరేబియా, ఒక సామాన్య మిలిటెంట్ గ్రూప్ అయిన హౌతీల ముందు ఇబ్బందిపడుతోంది. ఒకప్పుడు తాను చేసిన చిన్న తప్పు.. ఇప్పుడు 11 ఏళ్ల పగగా మారి ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అవును ఈ కథంతా నిన్నమొన్నటిది కాదు. కరెక్ట్‌గా 11 ఏళ్ల వెనక్కి వెళ్తే.. సౌదీ అరేబియా సరిహద్దుల్లో ఉండే యెమెన్ దేశంలో ఇరాన్ మద్దతుతో హౌతీలు అనే ఒక మిలిటెంట్ గ్రూప్ క్రమంగా బలపడుతోంది. తమ పక్కనే ఇరాన్ మద్దతు ఉన్న గ్రూప్ పవర్ లోకి వస్తే, రేపు తమకే ప్రమాదం అని సౌదీ అరేబియా ఆందోళన పడింది. దీంతో, హౌతీలను పూర్తిగా అంతం చేసి, యెమెన్‌లో తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని నిలబెట్టాలని 2015లో సౌదీ అరేబియా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. యూఏఈ తో కలిసి హౌతీల స్థావరాలపై భయంకరమైన వైమానిక దాడులు ప్రారంభించింది. కానీ, సౌదీ వేసుకున్న లెక్కలన్నీ తప్పాయి. యెమెన్ అనేది పర్వతాలతో కూడిన కఠినమైన భూభాగం. హౌతీలు ఆ కొండల్లో దాక్కుని దాడులు చేయడం స్టార్ట్ చేశారు. పైగా అక్కడి ప్రజల్లో వాళ్లు కలిసిపోవడంతో, సౌదీ చేసిన బాంబు దాడుల్లో ఎంతోమంది సామాన్యులు చనిపోయారు. అప్పుడే హౌతీలు సౌదీపై పగ పెంచుకున్నారు. మా దేశం మీదకొచ్చిన మిమ్మల్ని వదిలిపెట్టం అని ప్రతినబూనారు. 2022లో ఐక్యరాజ్యసమితి కలగజేసుకుని ఒక శాంతి ఒప్పందం చేసినా.. అది ఎన్నాళ్ళో నిలబడలేదు. సరిగ్గా అప్పుడే 2023లో గాజా యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా హౌతీలు మళ్లీ ఆయుధాలు పట్టారు. ఎర్ర సముద్రంలో పోయే వాణిజ్య నౌకలన్నీ తమ టార్గెట్ అంటూ దిగ్బంధనం చేయడం స్టార్ట్ చేశారు. దీనికి కౌంటర్‌గా అమెరికా రంగంలోకి దిగి హౌతీల మీద ఏకంగా 2000 బాంబులు వేసింది. కానీ, ఇక్కడే అసలు మలుపు. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య టెన్షన్లు పెరగడంతో, ఇరాన్ సపోర్ట్ ఉన్న హౌతీలు మరింత రెచ్చిపోయారు. యెమెన్ రాజధాని సనాను సౌదీ దిగ్బంధించిందని, ఇక తమ టార్గెట్ సౌదీ అరేబియానే అని జులైలో హౌతీలు పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. అన్నట్లుగానే సౌదీ నగరాలు, చమురు కర్మాగారాలు, ఎయిర్‌పోర్టులపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉమ్రా కోసం లక్షలాది మంది ప్రయాణికులు వస్తున్న సమయంలో ఈ దాడులు జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అసలు గల్ఫ్ దేశాలన్నీ ప్రశాంతంగా ఉంటే, సౌదీ మాత్రమే ఎందుకు ఇంతలా భయపడుతోంది? దీనికి కారణం.. హౌతీల సైనిక బలం. 2025 నాటికి హౌతీల సైన్యం సంఖ్య అక్షరాలా 3 లక్షల 50వేల కు చేరుకుంది. ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇరాన్ వీళ్లకు డ్రోన్లు తయారు చేసుకునే ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా వీరికి ఆయుధాలు సప్లై చేస్తోంది. ఇంకా చెప్పాలంటే వీళ్ల దగ్గర ఉన్న బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు ఇజ్రాయెల్ , గల్ఫ్ దేశాల్లోని ఏ మూలనైనా ఈజీగా టార్గెట్ చేయగలవు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి కూడా వీళ్లు ఆయుధాలు తయారుచేస్తున్నారని ఆంథ్రోపిక్ అనే సంస్థ సంచలన నిజాలు బయటపెట్టింది. ఒకవైపు సౌదీ సంకీర్ణ దళాలు 24 గంటల్లో 950 మంది హౌతీలను చంపామని చెప్తుంటే, హౌతీలు మాత్రం 107 మందే చనిపోయారు.. వాళ్ళలో మహిళలు, పిల్లలు ఉన్నారని చెప్తున్నారు. అంటే ఇక్కడ సైకలాజికల్ వార్ఫేర్ కూడా నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సౌదీకి మద్దతుగా నిలవాల్సిన అమెరికా మొహం చాటేసింది. ఒకప్పుడు తమతో కలిసి వైమానిక దాడులు చేసిన యూఏఈ కూడా ఇప్పుడు సైడ్ అయిపోయింది. దీని వెనుక ఒక కారణం ఉంది. అమెరికాలో ప్రస్తుతం మిడ్-టర్మ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ టైమ్‌లో మధ్యప్రాచ్యంలో మరో పెద్ద యుద్ధంలో తలదూర్చడం వాళ్లకు ఇష్టం లేదు. కేవలం నిఘా వర్గాలను మాత్రమే పంపి, సైనిక సాయం చేయకుండా సైలెంట్ అయిపోయింది. దీంతో సౌదీ పరిస్థితి ఇరకాటంలో ఉంది. హౌతీలను అణిచివేద్దాం అంటే వాళ్లు సామాన్యుల్లో కలిసిపోయారు. వైమానిక దాడులు చేస్తే పౌరులు చనిపోయి అంతర్జాతీయంగా చెడ్డపేరు వస్తుంది. అప్పుడిక గ్లోబల్ టూరిజం, బిజినెస్ హబ్ లాంటి యువరాజు కలలు కల్లలవుతాయి. ఈ యుద్ధం బయటకు చూడ్డానికి సౌదీ వర్సెస్ హౌతీలు లాగా కనిపిస్తుంది. కానీ తెర వెనుక నడుస్తున్నది సౌదీ వర్సెస్ ఇరాన్ ప్రచ్ఛన్న యుద్ధం. ఇరాన్ తన అత్యుత్తమ మిలిటరీ ట్రైనర్స్, ఇంజనీర్లను యెమెన్‌లోకి రహస్యంగా పంపించి హౌతీలకు ట్రైనింగ్ ఇస్తోంది. ఒకప్పుడు కేవలం తుపాకులు పట్టుకునే హౌతీలకు, బాలిస్టిక్ మిస్సైల్స్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించింది. డ్రోన్ విడిభాగాలు సముద్ర మార్గం ద్వారా స్మగ్లింగ్ చేసి, యెమెన్లోనే వాళ్లకు ఫ్యాక్టరీలు కట్టిపెట్టింది. ఇరాన్ ఇచ్చిన ఆయుధాలు, టెక్నాలజీ సపోర్ట్ వల్లే హౌతీలు ఈ రోజు అమెరికా, సౌదీ లాంటి అగ్రరాజ్యాలను కూడా ధైర్యంగా ఎదిరించగలుగుతున్నారు.



