డిసెంబర్ లో బంగ్లాకు హసీనా రీ-ఎంట్రీ…అప్పటి వీడియో తీసిన ఎయిర్‌ఫోర్స్ అధికారి మృ*తి

బంగ్లాదేశ్ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక ఉత్కంఠభరితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2024 ఆగస్టులో విద్యార్థుల హింసాత్మక ఆందోళనలతో దేశం విడిచిపెట్టి భారత్ కు పారిపోయి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆమె ఎంతో దీనంగా, మిలిటరీ రక్షణ నడుమ ఫ్లైట్ ఎక్కుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో లీక్ అయి గ్లోబల్ వైడ్ సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ వీడియో తీసిన బంగ్లాదేశ్ మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు దారుణమైన రీతిలో ప్రాణాలు కోల్పోవడం బంగ్లా రాజకీయాలలో సంచలనంగా మారింది. సరిగ్గా ఈ ఏడాది డిసెంబర్లో షేక్ హసీనా మళ్లీ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని ప్రకటించిన సమయంలోనే ఈ మరణం చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల నివేదికల ప్రకారం కేఎం తహ్సీఫ్ సౌరీ వయసు కేవలం 28 ఏళ్లు. ఆయన బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు. ఢాకాలోని ఉత్తర సెక్టార్ 18లో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అయితే అక్టోబర్ 27వ తేదీ నుంచి ఆయన సడెన్ గా కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు వెతుకుతుండగానే, అక్టోబర్ 28న టొంగీ బందర్ ఘాట్ ప్రాంతంలోని తురాగ్ నదిలో ఒక గుర్తుతెలియని మృతదేహం లభ్యమైందని రివర్ పోలీసుల నుంచి సమాచారం వచ్చింది.
మొదట ఆ మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తిగా పోలీసులు భావించారు. మృతుడు తెల్లటి ప్యాంట్, నలుపు రంగు చొక్కా ధరించి ఉన్నాడు. అయితే ఆయన జేబులో ఉన్న ఒక ఐఫోన్ , ఆయన చేతికి ఉన్న గడియారం ద్వారా ఆ మృతదేహం మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి సౌరీదే అని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఢాకాలోని షహీద్ సుహ్రావర్ది మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఇది మునిగిపోవడం వల్ల జరిగిన సాధారణ మరణం కాదని, ఆయన్ను ఉద్దేశపూర్వకంగానే ఎవరో అత్యంత దారుణంగా నదిలో పడేసి హత్య చేశారని సౌరీ కుటుంబ సభ్యులు గట్టిగా ఆరోపిస్తున్నారు.ఈ కేసు ఒక పక్కా పొలిటికల్ మర్డర్ లాగా మలుపు తిరిగింది. సౌరీ బంధువు మోష్ఫేకా జహాన్ తన ఫేస్బుక్ లో ఒక సంచలన పోస్ట్ పెట్టారు. నా సోదరుడిని అత్యంత దారుణంగా హత్య చేశారు. అతని తప్పేంటి? కేవలం హసీనా పారిపోతున్న వీడియోను పౌరుడిగా సోషల్ మీడియాలో షేర్ చేయడమేనా? అని ప్రశ్నిస్తూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆ రోజు హసీనా ఫ్లైట్ ఎక్కుతున్న వీడియోను స్వయంగా సౌరీ చిత్రీకరించలేదని , ఎయిర్ ఫోర్స్ కు చెందిన మరో సహోద్యోగి రికార్డ్ చేసిన దృశ్యాలను మాత్రమే ఆయన తన అకౌంట్ లో షేర్ చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.



