ఆదర్శ కుటుంబం ఎలా ఉంది?

తెలుగు ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేశ్ నటించిన ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే సినిమాలు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి. ఆ సినిమాల్లో వెంకటేష్ కామెడీ టైమింగ్ ఒక ఎత్తు అయితే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు మరో ఎత్తు. అప్పట్లో రచయితగా త్రివిక్రమ్ తన పెన్ పవర్ తో వెంకీకి అద్భుతమైన హిట్స్ ఇచ్చారు. ఇక తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ ప్రీమియర్స్ పడటం, మార్నింగ్ షోలు కంప్లీట్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా టాక్ వైరల్ గా మారింది.
సినిమా మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన వినోదం దొరుకుతుందని పబ్లిక్ టాక్ బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా వెంకటేష్ తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో ఫస్టాఫ్‌ను ఒంటిచేత్తో లాగేశారు. మల్లీశ్వరి రోజుల్లో వెంకీ ఎలాంటి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, సింపుల్ డైలాగ్ డెలివరీతో నవ్వించారో, మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమాలో అలాంటి వెంకీని చూస్తామని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ కూడా తన మార్క్ ప్రాసలను పక్కనపెట్టి, సిచువేషనల్ కామెడీపై ఎక్కువగా ఫోకస్ చేశారు. హీరోయిన్ శ్రీనిధి శెట్టితో వెంకటేష్ ట్రాక్ చాలా ఫ్రెష్‌గా ఉందని, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపై చాలా అందంగా పండిందని రివ్యూలు వస్తున్నాయి. కేజీఎఫ్ లాంటి సీరియస్ రోల్ తర్వాత శ్రీనిధి శెట్టికి ఇది ఒక మంచి బబ్లీ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇక ఫస్టాఫ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది మాత్రం కమెడియన్ సత్య . వెంకీ, సత్య కాంబినేషన్లో వచ్చే సీన్స్ థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించాయి. కథను చాలా సరదాగా తీసుకువెళ్తూనే, ఇంటర్వెల్ సమయానికి ఒక పవర్ ఫుల్ విలన్ ఎంట్రీతో ఇంటర్వెల్ బ్యాంగ్ ను త్రివిక్రమ్ అద్భుతంగా డిజైన్ చేశారు. ఫస్టాఫ్ పూర్తయ్యే సరికి సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే అసలు సమస్య అంతా సెకండాఫ్ మొదలయ్యాకే వచ్చిందని మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. ఫస్టాఫ్‌లో ఉన్న ఎనర్జీ, వేగం సెకండాఫ్ దగ్గరికి వచ్చేసరికి అమాంతం తగ్గిపోయాయి. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాపై దృష్టి పెట్టిన త్రివిక్రమ్.. స్క్రీన్‌ప్లే ను బాగా సాగదీసినట్లుగా అనిపిస్తుందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఫ్యామిలీ వాల్యూస్ గురించి చెప్పే ఎమోషన్స్ ఉన్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలు కథకు అడ్డుకట్ట వేసినట్లుగా స్లోగా సాగాయి. కొత్త తరహా కామెడీని, యాక్షన్ ను మిక్స్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, కొన్ని చోట్ల అది సహజంగా అనిపించలేదనే విమర్శలు బలంగా వస్తున్నాయి. ఎమోషనల్ సీన్స్ లో వెంకటేష్ తన యాక్టింగ్ తో ఎంతగా కవర్ చేయాలని చూసినా, రొటీన్ ఫ్యామిలీ డ్రామా ఫార్మాట్ లో కథ నడవడం కొంత మైనస్ గా మారింది. క్లైమాక్స్ బాగున్నప్పటికీ, అక్కడి వరకు చేరుకోవడానికి ఆడియన్స్ కాస్త ఓపిక తెచ్చుకోవాల్సి వస్తుంది.



