అంతరిక్షంలో భారత్ మరో సంచలనం.. నేడు నింగిలోకి ఇస్రో బాహుబలి

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఫోన్లలో లొకేషన్ అనగానే టక్కున గుర్తొచ్చేది జీపీఎస్. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలన్నా, మనం ఆర్డర్ పెట్టిన వస్తువులు డెలివరీ ఎక్కడిదాకా వచ్చిందో ట్రాక్ చేయాలన్నా మనం ఈ అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పైనే పూర్తిగా ఆధారపడుతున్నాం. ఒక సామాన్యుడి అవసరాలకు ఇది బాగానే ఉంటుంది కానీ, ఒక దేశ రక్షణకు, అత్యంత రహస్య సైనిక ఆపరేషన్లకు వేరొక దేశం మీద ఆధారపడటం అత్యంత ప్రమాదకరం. ఈ వాస్తవాన్ని గుర్తించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, అమెరికాకు ప్రత్యామ్నాయంగా మన దేశం కోసమే ప్రత్యేకంగా నావిక్ అనే పూర్తి స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ నావిక్ సేవలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నేడు రాత్రి 11 గంటల 51 నిమిషాలకు ఒక కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ప్రతిష్టాత్మక GSLV-F18 రాకెట్ ద్వారా అత్యంత శక్తివంతమైన ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని రాత్రి నింగిలోకి పంపనున్నారు. ఎన్వీఎస్-03 ఉపగ్రహం స్పెసిఫికేషన్స్ చూస్తే.. దీని మొత్తం బరువు ఏకంగా 2,232 కిలోలు. ఇంత బరువైన ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకుపోవడానికే ఇస్రో తమ అత్యంత నమ్మకమైన GSLV-F18 రాకెట్‌ను ఉపయోగిస్తోంది. అత్యాధునిక సోలార్ ప్యానెల్స్, పవర్ సిస్టమ్స్ తో డిజైన్ చేయబడిన ఈ ఉపగ్రహం లైఫ్ స్పాన్ సుమారు 12 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. అంటే రాబోయే 12 ఏళ్ల పాటు ఇది నిరంతరాయంగా నావిక్ సిస్టమ్ కు తన సేవలను అందిస్తూనే ఉంటుంది.
మన దేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఎందుకు అవసరమైందో తెలుసుకోవాలంటే మనం కార్గిల్ యుద్ధం నాటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకోవాలి. పాకిస్థాన్ చొరబాటుదారులు హిమాలయాల్లో ఎక్కడ నక్కి ఉన్నారో తెలుసుకోవడానికి నాటి భారత ప్రభుత్వం జీపీఎస్ డేటాను అమెరికాను కోరింది. కానీ ఆ డేటాను ఇవ్వడానికి అమెరికా నిర్మొహమాటంగా నిరాకరించింది. ఆనాడే మనకంటూ ఒక సొంత నావిగేషన్ వ్యవస్థ ఉండాలని ఇస్రో శాస్త్రవేత్తలు బలంగా నిర్ణయించుకున్నారు. అలా పుట్టిందే మన దేశీయ నావిగేషన్ సిస్టమ్ నావిక్. అయితే అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాల ద్వారా భూమిపై ఉన్న వస్తువుల లొకేషన్ ను ట్రాక్ చేయడం ఒక నిరంతర , క్లిష్టమైన ప్రక్రియ. ఇప్పటికే నావిక్ సిస్టమ్ కోసం ఇస్రో పలు ఉపగ్రహాలను ప్రయోగించింది. కానీ సాంకేతిక కారణాల వల్ల, పాత ఉపగ్రహాల్లో అమర్చిన విదేశీ గడియారాలు ఫెయిల్ అవ్వడం వల్ల ఈ వ్యవస్థలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆ లోపాలను పూర్తిగా సవరించి, జీపీఎస్ కంటే అత్యంత కచ్చితమైన లొకేషన్ సేవలను దేశ ప్రజలకు, సైన్యానికి అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఎన్వీఎస్-03 ఉపగ్రహ ప్రయోగం ప్రధాన ఉద్దేశం. ఈ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరితే, నావిక్ సిస్టమ్ పాత వైభవాన్ని సంతరించుకుని మరింత పటిష్టంగా మారుతుంది.


