పాకిస్తాన్లో ఎమర్జెన్సీ..ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్
ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఖైబర్ పఖ్తున్ఖ్వాలో పాక్ కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఎమర్జెన్సీ విధించింది. అడుగడుగునా ఇమ్రాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తున్న పాక్ ఉగ్రవాదాన్ని సాకుగా చూపి ఈ దారుణానికి ఒడిగట్టిందన్న విమర్శలు

పాకిస్తాన్ అంటేనే అస్థిరతకు, రాజకీయ కుట్రలకు మారుపేరు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు అక్కడ ఎప్పుడూ నిలకడగా పాలన సాగించిన దాఖలాలు లేవు. పాక్ ఆర్మీ కనుసన్నల్లో నడిచే ప్రస్తుత షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. ప్రతిపక్షాలను అణచివేయడానికి ఎంతకైనా తెగిస్తుందని మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఖైబర్ పఖ్తున్ఖ్వా. ఇప్పుడు ఆ రాష్ట్రంలో పాక్ కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా ఎమర్జెన్సీ విధించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి, పాలనను తన చేతుల్లోకి తీసుకుంది. అడుగడుగునా ఇమ్రాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తున్న పాక్ అధికార యంత్రాంగం.. ఉగ్రవాదాన్ని సాకుగా చూపి ఈ దారుణానికి ఒడిగట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతం భద్రతాపరంగా పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైనది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో, అలాగే బలూచిస్తాన్‌లో ఉగ్రవాద దాడులు విపరీతంగా పెరిగాయి. సరిగ్గా దీన్నే పాక్ కేంద్ర ప్రభుత్వం ఆసరాగా చేసుకుంది. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను సాకుగా చూపిస్తూ.. అక్కడ అత్యవసర పరిస్థితిని విధించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం ఆరోపించింది. ప్రధాని సలహా మేరకు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఈ ఎమర్జెన్సీ ప్రకటనపై అధికారికంగా సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అక్కడి పీటీఐ ప్రభుత్వం రద్దయింది. అయితే, ఇదంతా కేవలం ఉగ్రవాదాన్ని అరికట్టే ముసుగులో.. ప్రావిన్స్ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసి, ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారాలను హరించేందుకు పన్నిన కుట్ర అని పీటీఐ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఒకవైపు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి, మరోవైపు ఉక్కుపాదం మోపుతోంది పాక్ కేంద్ర ప్రభుత్వం. ఈ ఎమర్జెన్సీ నిర్ణయం తర్వాత ఖైబర్ పఖ్తున్ఖ్వాలో పరిస్థితులు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఎమర్జెన్సీ విధింపు తర్వాత ఖైబర్ పఖ్తున్ఖ్వా రాజధాని పెషావర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన రహదారులన్నింటినీ భారీ కంటైనర్లతో మూసివేశారు. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు. దీంతో సాధారణ ప్రజల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం కుండి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. ఎమర్జెన్సీ నిర్ణయం రాష్ట్రంలో శాంతి, అభివృద్ధికి సహకరిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పీటీఐ శ్రేణులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నా, హింస లేదా అల్లర్లలో పాల్గొన్నా కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భద్రతా సంస్థలకు ప్రజలంతా అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక రకంగా ప్రతిపక్ష నేతలు నిరసనలు చేయకుండా ముందే భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉగ్రవాదం అనేది పాకిస్తాన్లో దశాబ్దాలుగా ఉన్న సమస్యే. కానీ సడెన్ గా ఇప్పుడు ఎమర్జెన్సీ విధించడానికి అసలు కారణం.. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం జరుగుతున్న పోరాటమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆగస్టు 2023 నుంచి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తనపై నమోదైనవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులే అని ఇమ్రాన్ చెబుతున్నారు. ఈ క్రమంలో, ఆయన విడుదల కోసం అక్టోబర్ 4న ఖైబర్ పఖ్తున్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిదీ లక్కీ మార్వత్ నుంచి ఒక భారీ లాంగ్ మార్చ్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రను రాజధాని ఇస్లామాబాద్ వరకు తీసుకెళ్లాలని పీటీఐ భావించింది.
ముఖ్యమంత్రి నేతృత్వంలోనే ప్రజలు, ఇమ్రాన్ అభిమానులు రోడ్లపైకి వస్తుండటంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. ఈ ఆందోళనలు ఇస్లామాబాద్‌కు చేరితే ప్రభుత్వ మనుగడకే ముప్పు అని భావించిన కేంద్రం, ముందుగానే వ్యూహాత్మకంగా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ఎమర్జెన్సీ విధించిందనేది ప్రధాన ఆరోపణ. అంతేకాదు, సీఎం సోహైల్ అఫ్రిదీని అరెస్ట్ చేశారని పీటీఐ నేత జునైద్ అక్బర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పీటీఐ అధ్యక్షుడు బారిస్టర్ గోహర్ అలీ ఖాన్ ఈ చర్యను ప్రజాస్వామ్యానికి పట్టిన చీడ గా అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ వైరుధ్యాలు సహజం. కానీ పాకిస్తాన్లో మాత్రం అది రాజకీయ కక్ష సాధింపుగా, అణచివేతగా మారింది. ఉగ్రవాదాన్ని అరికట్టడం కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన అంశమే అయినప్పటికీ.. ఆ ముసుగులో ప్రజాస్వామ్య హక్కులను, రాజకీయ నిరసనలను బలితీసుకోవడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో అత్యవసర పాలన విధింపు పాకిస్తాన్లో ఇప్పటికే రగులుతున్న రాజకీయ సంక్షోభానికి ఆజ్యం పోసినట్లయింది. ఈ చర్యతో నిజంగానే భద్రతా పరిస్థితులు మెరుగుపడతాయా? లేక కేంద్ర ప్రభుత్వం, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల మధ్య విభేదాలు ఒక అంతర్యుద్ధానికి దారితీస్తాయా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. రాజ్యాంగ హక్కుల కోసం మళ్లీ వీధుల్లోకి వస్తామని పీటీఐ శ్రేణులు తేల్చి చెబుతున్నాయి. పాక్ రాజకీయ ముఖచిత్రం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.

