భారత్ దెబ్బకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు వణుకు… అండర్ గ్రౌండ్‌కు పరార్

ఒకప్పుడు పాకిస్థాన్ గడ్డపై స్వేచ్ఛగా తిరుగుతూ, బహిరంగ సభలు పెట్టి మరీ భారత్ పై నిత్యం విషం కక్కే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు ఇప్పుడు ప్రాణభయంతో తమ పాత స్థావరాలను వదిలి రహస్య ప్రాంతాలకు మకాం మార్చారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ వీరిని అండర్ గ్రౌండ్ లో దాచింది. భారత్ లో జరిగిన ఎన్నో దాడులకు మాస్టర్ మైండ్ అయిన లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ఇన్నాళ్లూ లాహోర్‌లోని జోహార్ టౌన్ లో విలాసవంతమైన జీవితం గడిపాడు. కానీ ఇప్పుడు ప్రాణభయంతో అతడిని అక్కడి నుంచి రావల్పిండికి తరలించారు. అక్కడి గారిసన్ గ్రౌండ్ ప్రాంతంలో ఐఎస్ఐ అతడికి ఒక రహస్య నివాసం ఏర్పాటు చేసింది. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రాంతం పాకిస్థాన్ సైన్యం ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉండటం గమనార్హం. అంటే ఒకప్పుడు బహిరంగంగా తిరిగి భారత్‌పై దాడులకు కుట్రలు పన్నిన వ్యక్తి, ఇప్పుడు తన ప్రాణ భద్రత కోసం ఏకంగా పాకిస్థాన్ సైనిక ప్రధాన కార్యాలయం వెనుక తలదాచుకుంటున్నాడు.
అంతేకాదు,అతని కదలికలపై ఇప్పుడు ఐఎస్ఐ ఆంక్షలు విధించింది. భద్రతను కూడా భారీగా పెంచింది. కేవలం ఎన్క్రిప్టెడ్ ఆడియో సందేశాల ద్వారానే తన అనుచరులకు సూచనలు ఇస్తున్నాడు. మరోవైపు 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అతడిని సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షాకు తరలించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. అక్కడ కూడా ఐఎస్ఐ నియంత్రణలో ఉన్న ఒక రహస్య స్థావరంలో అతనికి భద్రత కల్పించారు. కేవలం అత్యంత నమ్మకమైన కొద్దిమంది కమాండర్లతో మాత్రమే మసూద్ సంప్రదింపులు జరుపుతున్నాడు.
అసలు ఈ ఉగ్రవాద నేతలకు ఇంతలా ప్రాణభయం పట్టుకోడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అందులో మొదటిది 2025లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్. ఈ దాడుల్లో బహవల్పూర్ క్యాంప్ భారీగా దెబ్బతినడంతో జైషే మహమ్మద్ నెట్వర్క్ చాలా వరకు దెబ్బతింది. ఇప్పుడు భారత్ నుంచి మరోసారి అలాంటి దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతోనే ఈ ఇద్దరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక రెండో కారణం ఏంటంటే.. ఇటీవల పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో వరుసగా హతమవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హఫీజ్, మసూద్ ల కదలికలను ఐఎస్ఐ పూర్తిగా పరిమితం చేసింది.
అయితే పాక్ మాత్రం డబుల్ గేమ్ ఆడుతోంది. హఫీజ్ సయీద్ జైల్లో ఉన్నాడని పాక్ ఎప్పటినుంచో ప్రపంచ దేశాలను నమ్మిస్తోంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేసిన కేసుల్లో దోషిగా తేలడంతో, సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో 78 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నాడని పాకిస్థాన్ అధికారికంగా చెబుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రికార్డుల్లోనూ అతడు పాకిస్థాన్ కస్టడీలో ఉన్నట్లు పేర్కొన్నారు. 2020 ఫిబ్రవరి నుంచి ఏడు ఉగ్రవాద నిధుల కేసుల్లో దోషిగా తేలి అతనికి శిక్ష పడిందని రికార్డులు చెబుతున్నాయి. కానీ తాజాగా అతడు ఐఎస్ఐ రహస్య స్థావరంలో భద్రత మధ్య ఉన్నాడని నిఘా వర్గాలు పక్కా ఆధారాలతో చెబుతుండటం పాకిస్థాన్ డ్రామాలను బట్టబయలు చేస్తోంది. ఇక 2019లో ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటించిన మసూద్ అజర్ విషయంలోనూ పాకిస్థాన్ గతంలో ఇలాంటి ప్రచారమే చేసింది. అతడు పరారీలో ఉన్నట్లు ప్రకటించిన పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ .. 2026 సెప్టెంబర్‌లో అతడి ఆచూకీ తెలిపిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయల బహుమతి ప్రకటించింది. దీనిపై భారత్ అప్పట్లోనే తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదులపై రియల్ యాక్షన్ తీసుకోకుండా FATF ను మభ్యపెట్టేందుకు పాక్ చేస్తున్న ప్రచారం మాత్రమే ఇదని భారత విదేశాంగ శాఖ విమర్శించింది. 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అయినా, 1999 విమానం హైజాక్, 2001 పార్లమెంట్‌పై దాడి, 2019 పుల్వామా దాడులకు కుట్రదారుడు మసూద్ అజర్ అయినా సరే.. వీళ్లిద్దరూ దశాబ్దాల పాటు పాకిస్థాన్ అండతో భారత్ లో నెత్తురు పారించారు. కానీ ఇప్పుడున్న నయా భారత్ దెబ్బకు సొంత దేశంలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అండర్ గ్రౌండ్ లో తలదాచుకుంటున్నారు.



