దేశీయ స్టాక్ మార్కెట్ లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న భారత్-అమెరికా ట్రేడ్ డీల్ కుదిరిన నేపథ్యంలో దేశీయ సూచీలు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. ఇన్వెస్టర్ల సంపద 12లక్షల కోట్లు పైకి ఎగబాకింది. భారత్ తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు అమెరికన్ ప్రెసిడెంట్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. 18 శాతానికి టారిఫ్ లు తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీంతో నేటి సెషన్ ప్రారంభం నుండి మార్కెట్లు భారీ లాభాలతో పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ 2072 పాయింట్లు లాభంతో 83,739 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 639 పాయింట్లు లాభపడి 25,727 వద్ద స్థిరపడింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ రూ.90.26గా కొనసాగుతోంది. రూపాయి విలువ కూడా బలపడింది. ఇక సెన్సెక్స్ 30 ఇండెక్స్ లో బీ.ఈ.ఎల్, టెక్ మహీంద్రా మినహా అన్ని షేర్లు లాభాల్లో కొనసాగాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్ ఫార్మా తదితర షేర్లు భారీ లాభాల్లో కొనసాగాయి.