సినీ పరిశ్రమకు ధర్మేంద్ర చేసిన అపారమైన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గౌరవం తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని ఆయన భార్య, నటి హేమ మాలిని స్పందించారు. అయితే, ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందుకునే సమయంలో ధర్మేంద్ర స్వయంగా మన మధ్య లేకపోవడం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ధర్మేంద్ర గురించి మాట్లాడుతూ, హేమ మాలిని చాల ఎమోషనల్ అయ్యారు… “మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. ధర్మేంద్ర ఈ పురస్కారానికి అర్హుడు. అభిమానులు, సినీ పరిశ్రమకు చెందినవారంతా ఇప్పుడు ధర్మేంద్ర గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. అవి వింటుంటే మా హృదయాలు ఆనందం, గర్వంతో నిండిపోతున్నాయి. ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారం రావాలని ఎంతోమంది కోరుకున్నారు. ఆయన ఎప్పుడూ అవార్డుల కోసం పని చేయలేదు. తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలని నిరంతరం శ్రమించారు. ఎంతోమందికి స్ఫూరిగా నిలిచారు. ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాలు తప్ప ఒక్క ఫిల్మ్‌ఫేర్ కూడా రాలేదు. ఇప్పుడు ఇంత పెద్ద అవార్డును తీసుకోవడానికి ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయనతో వర్క్ చేసినవారంతా కూడా ప్రస్తుతం ఈ బాధలోనే ఉన్నారు’’ . అని హేమ అన్నారు. అలాగే ధర్మేంద్ర గారికి ఈ అవార్డు రావడం తో సినీ ప్రముఖులు తమ అభినందనలు తెలుపుతున్నారు.