వరుస విజయాల డైరెక్టర్ అనిల్ రావిపూడి… ఈసారి ఎవరితో బరిలోకి దిగుతాడో?

Spread the love

అనిల్ రావిపూడి… ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  ఈ పేరు ఒక సంచలనంగా మారిపోయింది.  ఫెయిల్యూర్ చూడని  దర్శకుడిగా దూసుకుపోతున్న ఆయన, మెగాస్టార్ చిరంజీవితో చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ఈ 2026 సంక్రాంతికి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. వరుసగా 9 హిట్లు కొట్టి ‘ట్రిపుల్ హ్యాట్రిక్’ సాధించిన అనిల్, ఇప్పుడు తన ల్యాండ్‌మార్క్ 10వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి సినిమా ఎవరితో ఉండబోతోంది? మళ్లీ సంక్రాంతికే వస్తారా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

అనిల్ రావిపూడి తదుపరి లక్ష్యం 2027 సంక్రాంతి అని తెలుస్తోంది. ఆయన తన 10వ సినిమాను కూడా తనకి అ కలిసివచ్చిన సంక్రాంతి సీజన్‌లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో పనిచేసిన అనిల్, ఇప్పుడు కింగ్ నాగార్జునతో సినిమా చేయాలనే తన మనసులోని కోరికను బయటపెట్టారు. ఈ కాంబినేషన్ సెట్ అయితే, టాలీవుడ్ నలుగురు సీనియర్ స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన ఏకైక న్యూ ఏజ్ డైరెక్టర్‌గా అనిల్ అరుదైన రికార్డు సృష్టిస్తారు.

అయితే నాగార్జున ప్రస్తుతం తన ప్రతిష్టాత్మక 100వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే అనిల్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, అనిల్ రావిపూడి తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో పాటు ‘దృశ్యం 3’ పనుల్లో ఉండటంతో, ఈ కాంబినేషన్ వెంటనే పట్టాలెక్కడం కొంచెం కష్టమేనని ఇండస్ట్రీ టాక్.

ఇక మెగా ఫ్యాన్స్‌లో మరో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేసే అవకాశం ఉందని, దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే, 2027 సంక్రాంతి రేసులో చరణ్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరోవైపు, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా అనిల్ రావిపూడి తదుపరి సినిమా కోసం గట్టిగా వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా ఉండవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. 

మొత్తానికి, అనిల్ రావిపూడి 10వ సినిమా ఎవరితో ఉన్నా అది కచ్చితంగా ఒక భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుందనడంలో సందేహం లేదు. నాగార్జునతో ఆ అరుదైన రికార్డు కోసం వెళ్తారా? లేక పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సరికొత్త ప్రయోగానికి తెరలేపుతారా? అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే 2027 సంక్రాంతికి కూడా అనిల్ తన కొత్త చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తాడని సినీ అభిమానులు కూడా భావిస్తున్నారు.