ఇప్పుడంతా తెలుగు అగ్ర హీరోలు కొత్త సినిమాలతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు భారీ ప్రాజెక్టులను ప్రారంభించి వేగంగా షూటింగ్‌లు పూర్తి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… రానున్న నెలల్లో ఈ స్టార్ హీరోల పుట్టినరోజులు వరుసగా ఉండటం. సాధారణంగా స్టార్ హీరోల బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్, స్పెషల్ వీడియో, టీజర్ లేదా సాంగ్ విడుదల చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఒక్క పోస్టర్ విడుదలైనా సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయి. ఒక మంచి పాట విడుదలైతే మార్కెట్లో సినిమాకి బజ్ పెరుగుతుంది. టీజర్, ట్రైలర్ లాంటి ప్రమోషనల్ కంటెంట్ చూసే ప్రేక్షకులు సినిమా థియేటర్లో చూడాలా వద్దా అన్న నిర్ణయం తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ విషయాల్లో చిత్రబృందాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేక టీమ్‌లను నియమించి నెలల తరబడి కసరత్తు చేస్తూ ఆ రోజు విడుదలయ్యే కంటెంట్‌ను సిద్ధం చేస్తున్నారు. మార్చి నెలలో రామ్ చరణ్ పుట్టినరోజు ఉంటుంది. మార్చి 27న ఆయన బర్త్‌డే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమా ‘పెద్ది’ ఏప్రిల్ 30న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అంటే ఆయన పుట్టినరోజు సమయానికి సినిమా విడుదలకు కేవలం నెల రోజులే మిగులుతాయి. అటువంటి సమయంలో ప్రొమోషన్స్ వేగం పెంచడం చాలా అవసరం. అందుకే ఆ రోజు టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాదు, త్వరలోనే ఈ చిత్రంలోని రెండో పాటను కూడా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు రామ్ చరణ్ తర్వాత చేయబోయే సుకుమార్ దర్శకత్వంలోని సినిమా గురించి కూడా ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఏప్రిల్ లో అల్లు అర్జున్ పుట్టినరోజు సందడి మొదలవుతుంది. ఏప్రిల్ 8న ఆయన బర్త్‌డే. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటివరకు పేరు కానీ, ఫస్ట్ లుక్ కానీ బయటకు రాలేదు. అందుకే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ గురించి కూడా ఆ రోజు ఏదైనా అప్డేట్ ఇవ్వవచ్చని టాక్ వినిపిస్తోంది.
మే నెలలో ఎన్టీఆర్ అభిమానుల పండుగ ఉంటుంది. మే 20న ఆయన పుట్టినరోజు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రావొచ్చని ఆశిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇక మార్చి 27న శ్రీరామనవమి పండుగ కూడా ఉండటంతో ఆ సందర్భంలో మరికొన్ని సినిమాల అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. మహేశ్ బాబు ఇంకా రాజమౌళి భారీ ప్రాజెక్ట్ గురించి కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ సినిమా కథ రామాయణం ఆధారంగా ఉంటుందని, మహేశ్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. శ్రీరామనవమి రోజున ఆయన లుక్ విడుదలైతే అభిమానులకు అది డబుల్ పండుగ అవుతుంది.
మొత్తానికి రాబోయే మూడు నెలలు టాలీవుడ్ అభిమానులకు నిజమైన పండగ సమయం. స్టార్ హీరోల పుట్టినరోజులు, కొత్త సినిమాల అప్డేట్స్, పోస్టర్లు, టీజర్లు ఇలా వరుస సంబరాలు జరగబోతున్నాయి. హీరోలు సెట్స్‌పై ఎంత బిజీగా ఉన్నారో, అభిమానులు కూడా అంతే ఉత్సాహంగా ఈ సందడిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు.