‘జేసీ డేనియల్ అవార్డు’ ..లెజెండరీ నటి శారదా కి అరుదైన గౌరవం

Spread the love

తెలుగు నేలపై పుట్టి, దక్షిణ భారత చిత్రసీమలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో తన నటనతో చెరగని ముద్ర వేసిన లెజెండరీ నటి శారద మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన అపూర్వమైన సేవలకు గానూ, కేరళ ప్రభుత్వం అందించే అత్యున్నత సినీ పురస్కారం ‘జేసీ డేనియల్ అవార్డు–2024’ కు ఆమెను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజీ చెరియన్ శుక్రవారం తిరువనంతపురంలో అధికారికంగా తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కింద రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను శారదకు అందజేయనున్నారు. జనవరి 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా ఈ పురస్కారం ఆమెకు అందనుంది. 2017లో జేసీ డేనియల్ అవార్డు గ్రహీతగా నిలిచిన ప్రముఖ గీత రచయిత శ్రీకుమరన్ తంబి అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ, శారదను ఈ గౌరవానికి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ కమిటీలో నటి ఊర్వశి, సినీ నిర్మాత బాలు కిరియత్ సభ్యులుగా ఉండగా, కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ కార్యదర్శి సి. అజోయ్ కన్వీనర్‌గా వ్యవహరించారు.శారద అసాధారణ ప్రతిభ కలిగిన నటి అని జ్యూరీ ప్రశంసించింది. తన నటన ద్వారా మలయాళ చిత్రసీమకు రెండు జాతీయ ఉత్తమ నటి అవార్డులు తీసుకొచ్చిన ఘనత ఆమెకే దక్కిందని పేర్కొంది. 1960ల నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు మలయాళీ మహిళల జీవన వేదనలను, వారి సహనాన్ని, భావోద్వేగాలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారని, పాత్రల్లో పూర్తిగా లీనమై ప్రేక్షకుల హృదయాలను కదిలించారని జ్యూరీ అభిప్రాయపడింది.

శారద 1945 జూన్ 25న ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో వెంకటేశ్వరరావు, సత్యవాణి దేవి దంపతులకు జన్మించారు. ఆమె అసలు పేరు సరస్వతీ దేవి. తెలుగు సినీ పరిశ్రమలో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంతో ప్రయాణాన్ని ప్రారంభించిన శారద గారు, స్వల్ప కాలంలోనే దక్షిణాది సినీ దిగ్గజాలలో ఒకరిగా ఎదిగారు. గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన ఆమె, తన సహజ సిద్ధమైన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందారు. 125కు పైగా మలయాళ చిత్రాల్లో నటించి, అక్కడి ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా, తన అద్భుత ప్రదర్శనతో భారతీయ సినిమా గర్వించదగ్గ నటిగా పేరు తెచ్చుకున్నారు.శారద గారి కెరీర్‌లో జాతీయ ఉత్తమ నటి అవార్డులు ఒక ప్రత్యేక అధ్యాయం. ‘తులాభారం’ (1968), ‘స్వయంవరం’ (1972) వంటి మలయాళ చిత్రాలతో పాటు, తెలుగు చిత్రం ‘నిమజ్జనం’ (1977) ద్వారా ఆమె మూడుసార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. ఇలా మూడుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలవడం సినీ చరిత్రలో ఒక అరుదైన ఘనత. ఈ విజయాల పరంపరతో ఆమెకు ‘ఊర్వశి’ అనే గౌరవ బిరుదు లభించింది, అప్పటి నుండి సినీ లోకం ఆమెను ‘ఊర్వశి శారద’ అని గౌరవంగా పిలుచుకోవడం ప్రారంభించింది.ఆమె నటించిన ‘మురప్పెన్ను’, ‘త్రివేణి’, ‘ఎలిప్పతాయం’ వంటి క్లాసిక్ చిత్రాలు ఇప్పటికీ నటనకు పాఠ్యపుస్తకాలుగా నిలుస్తాయి. కేవలం నటిగానే కాకుండా, తెనాలి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసి ప్రజా సేవలోనూ తన ముద్ర వేశారు. తాజాగా ఆమెకు రాష్ట్ర అత్యున్నత సినీ పురస్కారం లభించడం ఆమె దశాబ్దాల కృషీవలానికి, అంకితభావానికి దక్కిన సముచిత గౌరవం.