తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై రోజు రోజుకీ అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లుక్, సినిమా మేకింగ్ స్టైల్, విడుదలైన గ్లింప్సెస్ చూసిన తర్వాత అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న శివరాజ్ కుమార్ పాత్రకు సంబంధించిన వీడియోను మూవీ టీమ్ విడుదల చేసింది. ‘గౌర్నాయుడు’ అనే పవర్ఫుల్ పాత్రలో శివరాజ్‌కుమార్ కనిపించగా, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కథలో కీలక మలుపు తిప్పే వ్యక్తిగా ఆయన పాత్ర ఉండబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శివరాజ్‌కుమార్ వంటి సీనియర్ నటుడు ఈ తరహా పాత్రలో కనిపించడం సినిమాకి మరింత బలం తీసుకొచ్చే అంశంగా మారింది. తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో ఆయనకు ఉన్న అభిమాన వర్గం వల్ల ‘పెద్ది’కి ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా కుస్తీ, గ్రామీణ క్రీడలు, స్థానిక సంస్కృతి చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరగా అనిపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోలో కనిపించిన విజువల్స్ సినిమాపై భారీ స్థాయిలో హైప్ తీసుకొచ్చాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, సమర్పకులుగా వ్యవహరిస్తుండటం సినిమాపై మరింత నమ్మకాన్ని పెంచుతోంది. ఇప్పటికే భారీ సినిమాలు నిర్మించి విజయాలు అందుకున్న ఈ సంస్థలు ‘పెద్ది’ని కూడా అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పుడు అభిమానులందరి దృష్టి ‘పెద్ది’ ట్రైలర్‌పైనే ఉంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మే 18న ముంబైలో భారీ స్థాయిలో నిర్వహించే గ్రాండ్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశముందని సమాచారం. ఇప్పటికే గ్లింప్స్‌తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత అంచనాలు మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. జగపతి బాబు, శివరాజ్ కుమార్ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.