ఈరోజు “పునాదిరాళ్లు” కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు:మెగాస్టార్ చిరంజీవి 

Spread the love

దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో తన నటనతో శిఖరాగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు ఆయన నట జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానముంది. అదేంటంటే ఆయన  తన సినీ ప్రస్థానంలో తొలి అడుగు వేసిన రోజు నేడు. ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తన జీవితంలో మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నది ఫిబ్రవరి 11నే అని ఆయన తెలిపారు. ‘పునాదిరాళ్లు’ సినిమా కోసం తాను తొలిసారి నటించిన ఆ రోజును గుర్తుచేసుకుంటూ ఆయన ఈ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా  కృతజ్ఞతలు తెలిపారు.