అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, గవర్నర్ గారి బడ్జెట్ ప్రసంగం అంత డొల్ల అని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిపై దశ – దిశ లేదు. అంతా అవాస్తవాలు..కల్పితాలని పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోకు మెరుగులద్ది చదివినట్లుందని 19 నెలల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వానికి విజన్ లేదు .. విజ్డం లేదు. సుపరిపాలన లేదు .. సమతూకం అంతకన్నా లేదని విమర్శించారు. కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాఫ్ అని దుయ్యబట్టారు. P4 తో పేదరికం అరికట్టడం అనేది పచ్చి మోసం. 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంతా అభూత కల్పన అని విమర్శించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ ని చంపారని ఆరోపించారు. 1.43 కోట్ల కుటుంబాలకు వైద్యం అందని ద్రాక్ష చేశారని పోలవరం ఎత్తు 41.15 తగ్గించి జీవనాడిలో జీవం తీశారని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానికి సైతం పట్టింపు లేదు కానీ .. రాష్టానికి గుదిబండలా మారే పోలవరం – నల్లమలసాగర్ పై అమిత ప్రేమ చూపిస్తున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత అంటూ చేస్తున్నవి డ్రామాలు తప్పిస్తే.. చేతలు మాత్రం ఆమడ దూరం. స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్, డ్రోన్ సిటీల పేరుతో, ఇతర హబ్ ల పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం తప్పా ఆచరణ నేటివరకు శూన్యమని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవస్థ అభివృద్ధికి ఊతం ఇచ్చిన MGNREGA ను కాదని VB G- RAM G పథకం గొప్పగా ఉందనడం కూటమి ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. కూటమి పాలన వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన అవకాశం వైసీపీకి ఉన్నా.. ఈ సారి సైతం ప్రతిపక్షం ఇస్తేనే సభ ముందుకు అని చెప్పడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. మైకు ఇస్తేనే అంటూ మారం చేయడానికి కాదు కదా అసెంబ్లీకి పంపింది ? జగన్ గారు సొంత అజెండాను పక్కకు పెట్టి, ప్రజల అజెండాతో అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. కూటమి హామీలపై, నిర్లక్ష్యాలపై సభావేదికగా అధికార పక్షాన్ని నిలదీయాలని శాసనసభకు వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే జగన్ ఆయన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని అన్నారు.