నేడు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్దార్ధ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్ధించిన సుప్రీం ధర్మాసనం సిద్దార్ధ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. పోస్టుమార్టం జరిగిన తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం జరిపిన పద్దతి సరిగా లేదని అభిప్రాయపడింది.
కేసు వివరాలను ఒకసారి పరిలీలిస్తే ప్రత్యూష, సిద్దార్థ రెడ్డి హైదరాబాద్ లో ఇంటర్ చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ తరువాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లారు. సిద్దార్థరెడ్డి ఇంజనీరింగ్ లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేరారు. ప్రత్యూష 24న చనిపోయారు. ట్రీట్మెంట్ తరువాత మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. వారు కూల్ డ్రింక్ లో పురుగుమందు కలిపి తాగినట్లు టెస్ట్ లలో తేలినట్లు గుర్తించారు. ఆర్గానో ఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు డాక్టర్ల బృందం నివేదిక ఇచ్చింది.
దీని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ జరిపిన సీబీఐ నిందితుడిపై 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 309 (ఆత్మహత్యకు యత్నించడం) సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పునిచ్చింది. దీనిపై సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలంటూ తీర్పునిచ్చింది.