ఢిల్లీ హైకోర్టులో అకీరా నందన్ కు భారీ ఊరట

Spread the love

ఇటీవల కాలంలో సినీ ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు సైతం  వ్యక్తిగత గోప్యతా హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తుండడం తెలిసిందే.తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనయుడు  అకీరా నందన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన పర్మిషన్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో  రూపొందించిన డీప్‌ఫేక్ సినిమాపై అకీరా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ సినిమాను వెంటనే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

తన పేరు, ఫొటోలు, వాయిస్ వంటి వాటిని వాడుకుని ‘AI లవ్ స్టోరీ’ పేరుతో ఓ పూర్తిస్థాయి సినిమాను రూపొందించారని, దానిని యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో విడుదల చేశారని అకీరా తన పిటిషన్‌ లో పేర్కొన్నాడు. ఈ డీప్‌ఫేక్ సినిమా వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని అతడు కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఇది తన వ్యక్తిత్వ, గోప్యతా హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ తుషార్ రావు  అకీరా కు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అతడి పర్మిషన్  లేకుండా ఎలాంటి డీప్‌ఫేక్ కంటెంట్‌ను సృష్టించడం, షేర్ చేయడం చేయరాదని సంభవామి స్టూడియోస్‌తో పాటు ఇతరులను ఆదేశించారు. వివాదాస్పద సినిమా లింకులను, ఫేక్ అకౌంట్లను వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. ఈ కంటెంట్‌ను అప్‌లోడ్ చేసిన వారి ఐపీ అడ్రస్‌లు, ఇతర వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.