ప్రపంచ రక్షణ రంగంలో భారత్ రోజురోజుకూ తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ దూసుకెళ్తోంది. డిఫెన్స్ సెక్టార్ లో కూడా కీలక మార్పులు తీసుకొస్తూ ఆత్మనిర్బర్ భారత్ నినాదంతో మన స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఆయుధాలతో శత్రు దేశాలకు అందనంత ఎత్తులో ఉంది. ముఖ్యంగా మన బ్రహ్మోస్ మిస్సైల్ పేరు చెబితేనే చైనా, పాకిస్థాన్ లకు చెమటలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే మన బ్రహ్మోస్‌కు కౌంటర్‌గా పాకిస్థాన్ ఫతా-3 అనే ఒక సూపర్ సోనిక్ మిస్సైల్‌ను తాజాగా తెరపైకి తెచ్చింది. అయితే, ఇక్కడే ఒక సంచలన నిజం బయటపడింది. ఏ ఆయుధాన్నైనా సొంతంగా తయారుచేసుకునే సత్తా లేని పాకిస్థాన్.. ఈ ఫతా-3 మిస్సైల్ కోసం పూర్తిగా చైనా టెక్నాలజీని కాపీ కొట్టిందనే వార్తలు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా హాట్ టాపిక్ అయ్యాయి. పాకిస్థాన్‌లోని గ్లోబల్ ఇండస్ట్రియల్ అండ్ డిఫెన్స్ సొల్యూషన్స్ సంస్థ ఈ క్షిపణిని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫతా-3 క్షిపణి అత్యంత వేగంగా, కచ్చితత్వంతో శత్రువుల టార్గెట్లను ధ్వంసం చేయగలదని పాక్ ఆర్మీ చెబుతోంది. దీని రేంజ్ దాదాపు 400 కిలోమీటర్ల వరకు ఉంటుందని, రాడార్లను తప్పించుకుని అత్యంత వేగంగా దూసుకువెళ్లే టెక్నాలజీ ఇందులో ఉందని వారు చెబుతున్నారు. అయితే, డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ ఈ మిస్సైల్ డిజైన్, పనితీరును లోతుగా పరిశీలించిన అందరూ అవాక్కయ్యే నిజాన్ని బయటపెట్టారు. ఈ ఫతా-3 పాకిస్థాన్ సొంత టెక్నాలజీ కానే కాదు అని తేల్చేశారు. ఇది అక్షరాలా చైనా తయారుచేసిన క్షిపణులకు జిరాక్స్ కాపీ అని చెప్పుకొస్తున్నారు. ఇండియా , రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ పవర్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. బ్రహ్మోస్ గంటకు 3,000 కిలోమీటర్ల పైగా వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి టార్గెట్ లాక్ చేసి బ్రహ్మోస్ ను ఫైర్ చేస్తే.. దానిని ఆపడం ప్రస్తుతానికి ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్లా కాదు. భూమి, సముద్రం, ఆకాశం, జలాంతర్గాముల నుంచి.. ఇలా ఎక్కడినుంచైనా దీనిని ప్రయోగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రహ్మోస్ మిస్సైల్ కు భారీ డిమాండ్ ఉంది. అందుకే ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు కూడా మన దగ్గర నుంచి బ్రహ్మోస్ ను కొనుగోలు చేస్తున్నాయి. ఇక పాకిస్థాన్ ఎప్పుడూ రక్షణ రంగంలో చైనా పైనే ఆధారపడుతుంది అనేది తెలిసిన విషయమే. చైనాకు చెందిన A-100, ఇతర రాకెట్ సిస్టమ్స్ డిజైన్లనే బేస్ చేసుకుని ఈ ఫతా సిరీస్ మిస్సైల్స్‌ను డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది. గైడెన్స్ సిస్టమ్ , ఏరోడైనమిక్స్, పేలోడ్ కెపాసిటీ ఇలా ప్రతి ఒక్క టెక్నికల్ కోణంలో చైనా ఇంజనీర్ల హస్తం, వారి టెక్నాలజీ సహాయం స్పష్టంగా కనిపిస్తోందని గ్లోబల్ డిఫెన్స్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. చైనా పాత టెక్నాలజీని తెచ్చుకుని, దానికి పాకిస్థాన్ బ్రాండ్ వేసుకుని వారు మన బ్రహ్మోస్‌తో పోటీ పడుతున్నామని కలలు కంటున్నారు. బ్రహ్మోస్‌కు ఫతా-3 నిజంగానే పోటీ ఇవ్వగలదా?అంటే అది హాస్యాస్పదమేనని డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ ల అభిప్రాయం. ఫతా-3 , బ్రహ్మోస్ తో ఏమాత్రం సరితూగదు. బ్రహ్మోస్ స్థాయికి చేరుకోవాలని పాకిస్థాన్ కంటున్న ఒక కల మాత్రమే అని రక్షణ రంగ నిపుణులు తేల్చేస్తున్నారు. భారత్ యొక్క ఆయుధ సంపదను, ముఖ్యంగా బ్రహ్మోస్ లాంటి మిస్సైల్స్‌ను చూసి పాకిస్థాన్ ఎంతలా భయపడుతుందో ఈ ఫతా-3 ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది.