కృత్రిమ మేధ (AI) పనితీరుపై ‘ఏఐ గాడ్‌ఫాదర్’ జెఫ్రీ హింటన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025లో మనం చూసిన ఏఐ వేగం ఇలాగే కొనసాగితే, 2026 ప్రారంభం నాటికే ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఆయన స్పష్టంగా హెచ్చరించారు. ముఖ్యంగా ఆలోచన, డేటా విశ్లేషణ & నిర్ణయాలు తీసుకునే ‘వైట్-కాలర్’ ఉద్యోగాలు ఏఐ వల్ల మనుషుల చేయి దాటిపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గతంలో మనుషులు మాత్రమే చేయగలరని భావించిన పనులను ఇప్పుడు ఏఐ వేగంగా, అత్యంత తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తోందని ఆయన గుర్తుచేశారు.ఆర్ధిక లాభాల కోసం కంపెనీలు సిబ్బందిని తగ్గించి ఏఐ వైపు మొగ్గు చూపడం వలన ఉత్పాదకత పెరిగినా, కొత్త ఉద్యోగాల సృష్టి మాత్రం సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఏఐ వ్యవస్థలను నియంత్రించడం, పర్యవేక్షించడం వంటి విభాగాల్లో కొత్త రకాల ఉపాధి అవకాశాలు వస్తాయని హింటన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో కేవలం సాంకేతికతపై ఆధారపడటమే కాకుండా, నాయకత్వ లక్షణాలు , పాలసీ నిర్ణయాలు తీసుకునే రంగాల్లో మనుషుల అవసరం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ మార్పులకు అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడం ఒక్కటే ప్రస్తుతానికి ఉన్న ఏకైక మార్గం.అయితే ఉద్యోగాల కంటే మించిన మరో పెద్ద ముప్పు ఏఐ వలన ఉందని హింటన్ హెచ్చరించారు.శక్తిమంతమైన ఏఐ వ్యవస్థలు క్రమంగా మోసపూరిత ప్రవర్తనను నేర్చుకునే ప్రమాదం ఉందని, భద్రతా నిబంధనలు పాటించని కంపెనీల వల్ల సమాజానికి ముప్పు వాటిల్లవచ్చని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.లాభాల వేటలో ఏఐని నియంత్రించడంలో విఫలమైతే అది మానవాళికే పెను సవాలుగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.