పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఒకప్పటి దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ హెల్త్ కండీషన్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే చికిత్స అందించకపోతే తమ నేతకు కంటిచూపు పోయే ప్రమాదం ఉందని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వర్గాలు తెలిపాయి. అక్కడి మీడియా కథనాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ కుడి కంటిలో సమస్య తలెత్తిందని, దానికి వెంటనే ట్రీట్మెంట్ అందించకపోతే చూపుపోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తంచేశాయి. వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లాలని డిమాండ్ చేశాయి. డాక్టర్ల సూచనను పట్టించుకోకుండా జైల్లోనే ఆయనకు చికిత్స అందించాలని జైలు అధికారులు పట్టుబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2024 అక్టోబర్ లో ఇమ్రాన్ తన వ్యక్తిగత డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకున్నారని, ఆ తర్వాత నుంచి ఆ డాక్టర్ ను కలిసేందుకు అనుమతించడం లేదని తెలిపాయి.