మైనారిటీలపై దాడుల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై షేక్ హసీనా విమర్శలు  

Spread the love

బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల మైనారటీ హిందువులపై దాడులు పెరిగిపోతున్న విషయం విదితమే.  దైవ దూషణ నెపంతో  హిందూ యువకుడిని కొట్టి చంపిన ఘటన నుంచి మొదలుకొని దొంగతనం ఆరోపణలతో తరమడంతో హిందూ యువకుడు ఒకరు కాలువలో దూకి చనిపోవడం వంటి ఘటనలు, ఇళ్లను తగులబెట్టడం, మహిళలపై అత్యాచారాలు సహా అనేక  దారుణాలు జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలోనే మొత్తం 51 దారుణమైన ఘటనలు జరిగాయి. దీనిపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న  షేక్ హసీనా తాజాగా స్పందించారు. ఒక  ఇంటర్వ్యూలో ఆమె  మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో మతపరమైన హింసకు తావులేదని స్పష్టం చేశారు. తన హయాంలో ప్రజల్లో మతసామరస్యం పెంపొందించినట్లు పేర్కొన్నారు. మతంతో సంబంధం లేకుండా ప్రజలంతా కలిసిమెలిసి జీవించేలా ప్రోత్సహించినట్లు తెలిపారు. తన ప్రభుత్వం పడిపోయాక  బంగ్లాదేశ్ లో హింస పెరిగిపోయిందని, మైనారిటీలకు దేశంలో రక్షణ లేకుండా పోయిందని హసీనా ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని మైనారిటీ వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత  అని, ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని ఆక్షేపించారు. ఈ విషయంలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి యూనస్ విఫలయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ దారుణ సంఘటనల వెనక మత కోణం లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని  విమర్శించారు. ఇది బంగ్లాదేశ్ లోని మైనారిటీలకు మాత్రమే కాదు దేశ లౌకిక, ప్రజాస్వామ్య విధానాలకే ముప్పుగా మారుతుందని ఆమె ఈ సందర్భంగా  హెచ్చరించారు.