‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ వివాదం: చైనా విమర్శలను తిప్పికొట్టిన భారత్!

Spread the love

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రంపై చైనా చేస్తున్న విమర్శలను భారత ప్రభుత్వం గట్టిగా తిప్పికొట్టింది.ఈ సినిమా చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తోందని చైనా అధికారిక మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ చేసిన ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.భారతదేశంలో కళాత్మక స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ పౌరులందరికీ ఉంటుందని, చిత్రనిర్మాతలు తమకు నచ్చిన కథలను ఎంచుకునే హక్కు కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.ఈ సినిమా నిర్మాణంలో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదని, ఈ సృజనాత్మక ప్రక్రియను రాజకీయం చేయొద్దని చైనాకు పరోక్షంగా సూచించాయి. 2020 గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై సందేహాలు ఉంటే రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చని భారత వర్గాలు పేర్కొన్నాయి.

2020 జూన్ 15న గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన భీకర పోరాటంలో వీరమరణం పొందిన కల్నల్ బి. సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నారు.ఈ చిత్ర టీజర్ ఇటీవల సల్మాన్ 60వ పుట్టినరోజు సందర్భంగా విడుదలై సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంది. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిత్రంగద సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా “ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3” పుస్తకం ఆధారంగా నిర్మితమవుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం 2026 ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.