వ్యవసాయ,డెయిరీ రంగాలకు అమెరికా భారత్ ఒప్పందంలో పూర్తి రక్షణ ఉండనుందని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఇక అంతేకాకుండా జూట్-వస్త్రాలు, ప్లాస్టిక్, జెమ్స్, లెదర్ ప్రొడక్ట్స్, హౌస్ డెకరేటింగ్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ కెమికల్స్, రబ్బర్ ప్రొడక్ట్స్, మెషీన్స్, విమానతయారీ రంగంలోని కార్మికులకు అపార అవకాశాలు లభిస్తాయని తెలిపారు. త్వరలో రెండు దేశాలు ఉమ్మడి ప్రకటన చేస్తాయని అప్పుడు మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలు రంగాల్లో అమెరికా టారిఫ్ లు 50 శాతం నుండి 18 శాతానికి తగ్గనున్నట్లు తెలిపారు. చైనా, కంబోడియా, బంగ్లాదేశ్, వియాత్నం, మలేసియాల కంటే తక్కువ టారిఫ్ లే మనకు ఉండనున్నట్లు తెలిపారు.
ఈ ఒప్పందం భారతదేశ ఆర్థిక శక్తిని, ప్రపంచ దేశాల్లో మనపై ఉన్న నమ్మకాన్ని మరియు 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) లక్ష్యాన్ని బలోపేతం చేసే ఒక నిర్ణయాత్మక అడుగని పేర్కొన్నారు. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే, పూర్తి ఆత్మవిశ్వాసంతో మరియు వ్యూహాత్మక స్పష్టతతో చర్చలు జరిపింది. మార్కెట్ లభ్యత, పెట్టుబడులు, సాంకేతికత మరియు ఉపాధి వంటి ప్రతి రంగంలోనూ ఈ ఒప్పందం భారతదేశాన్ని ముందుకు నడిపిస్తుంది.
ఈ చారిత్రాత్మక ఆర్థిక విజయంపై పార్లమెంటులో చర్చ జరుగుతుందని దేశం ఆశించిన తరుణంలో, ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం దురదృష్టకరమని అన్నారు. వారి ఈ వైఖరి వారి నిరాశను మరియు విధానపరమైన శూన్యతను స్పష్టం చేస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వంపై దేశానికి పూర్తి విశ్వాసం ఉంది. భారతదేశం ఇప్పుడు ఏ ఒప్పందాలైనా ఒత్తిడితో కాకుండా, తన సొంత నిబంధనల ప్రకారమే చేసుకుంటోంది—ఇదే ‘నవ భారత’ సంకేతమని పేర్కొన్నారు.