‘గగన్ యాన్’ ను విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యం:ఇస్రో ఛైర్మన్

Spread the love

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్. ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతీయులను స్వదేశీ సాంకేతికతతో అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యం. ఈ ప్రయోగం విజయవంతమైతే, అమెరికా, రష్యా, చైనా తర్వాత అంతరిక్షంలోకి మానవులను పంపిన నాల్గవ దేశంగా భారత్ అవతరిస్తుంది. కాగా, ఈ ప్రాజెక్టులో భాగంగా మానవ రహిత రాకెట్ ను నింగిలోకి పంపించేందుకు సమాయత్తమవుతున్నట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. ఫీల్డ్ లెవెల్ లో 8వేలకు పైగా ప్రయోగాలు విజయవంతమైనట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఆస్ట్రోనాట్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మూడు మానవ రహిత రాకెట్లను ప్రయోగించనున్నట్లు తెలిపారు. మార్చిలో మొదటి ప్రయోగం చేపట్టేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారన్నారు. రాకెట్ లోని ప్రతి సిస్టమ్ ను పరిశీలిస్తున్నామని ‘గగన్ యాన్ మిషన్’ ను విజయవంతంగా పూర్తి చేయడమే ఫైనల్ టార్గెట్ అని చెప్పారు. ఈ ఏడాది చివరిలో రెండో మానవ రహిత రాకెట్ ప్రయోగం ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు తుది దశకు చేరిందన్నారు. మానవ సహిత స్పేస్ మిషన్లో భాగంగా మార్చిలో ‘వ్యోమమిత్ర’ రోబోను పంపనున్నారు. 2027లో చేపట్టనున్న గగన్ యాన్ యాత్రకు ఎయిర్ ఫోర్స్ కు  చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికైన విషయం తెలిసిందే.