విశాఖపట్నంలో చంద్రబాబు ఆయన కుటుంబం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఆయన తన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. హలో ఇండియా… ఇది ఒక వేక్-అప్ కాల్. రుషికొండ సమీపంలో ఉన్న 54.79 ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం ద్వారా బహిరంగంగానే కబ్జా చేసేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా చంద్రబాబు, అత్యంత విలువైన ఈ భూమిని తన సొంత కుటుంబ సభ్యుడైన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్‌కు కట్టబెట్టరన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో తిరిగి స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్ వేసిన భూములను ఇప్పుడు మళ్లీ చంద్రబాబుగారు తన కుటుంబానికి ఉచితంగా బహుమానంగా ఇచ్చేశారని పేర్కొన్నారు. ఈ విలువైన భూములను లోకేష్ తన తోడల్లుడికి కట్టబెట్టడం, చంద్రబాబు కుటుంబ కుట్రను బయటపెడుతోందని ఆక్షేపించారు. లోకేష్‌కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, విద్యాశాఖ నుంచి ఒక మెమో జారీ చేసి ఈ భూములను తన తోడల్లుడికి కేటాయించేలా చేశారని జగన్ విమర్శించారు.
ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లు, బెదిరింపులతో నగర పాలక సంస్థ సభ్యుల (గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్)ను భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారని తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వైయస్సార్సీపీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడితే, వారిపై భౌతిక దాడులు చేసి బలవంతంగా బయటకు తోసేశారు. ఈ దాడుల్లో పలువురు వైయస్సార్సీపీ కార్పొరేటర్లు గాయపడగా, పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. ఈ భూ దోపిడీని అమలు చేయడానికి చంద్రబాబు, బీసీ యాదవ వర్గానికి చెందిన వైయస్సార్సీపీ మహిళా మేయర్‌ను తొలగించారు, కార్పొరేటర్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను బుల్డోజ్ చేసి రూ.5,000 కోట్ల విలువైన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు కానుకగా ఇచ్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి. వారి కుటుంబ ఆస్తులు పెరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పరిపాటిగా జరిగిపోతుందని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌లు తమ పాలనను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదని జగన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.