భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుడిపైకి తదుపరి చేపట్టబోయే చంద్రయాన్-4 మిషన్ కోసం కసరత్తు ముమ్మరం చేస్తోంది. చంద్రుడి సౌత్ పోల్ (దక్షిణ ధృవం) ప్రాంతంపై ఈ స్పేస్ షిప్ ను దించాల్సిన ప్రదేశాన్ని తాజాగా ఖరారు చేసింది. చంద్రుడి నుండి శాంపిల్స్ ను భూమికి తీసుకొచ్చేలా చంద్రయాన్-4ను ఇస్రో రూపొందిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. చంద్రుడి పైకి ఇస్రో చేపట్టిన అన్ని మిషన్లలో ఇది అత్యంత సంక్లిష్టమైనదిగా పేర్కొనవచ్చు. 2028 నాటికి దీన్ని ప్రయోగించాలని సంస్థ టార్గెట్ గా పెట్టుకుంది. చంద్రుడి ఉపరితలంపై మాన్స్ మౌటన్ అనే ప్రదేశంలోని ఎంఎం-1, 3, 4, 5 అనే నాలుగు ప్రదేశాలను ల్యాండింగ్ కోసం ఇస్రో పరిశీలించి దానిలో ఎంఎం-4ను ఎంచుకున్నట్లు సంస్థ అధికారులు తెలిపారు. చంద్రుడి ఆర్బిట్ లో తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని హై రిజల్యూషన్ కెమెరా (ఓహెన్ఆర్సీ) అందించిన ఫోటోల ఆధారంగా ఈ ఎంపిక చేసినట్లు తెలిపారు.