పోలాండ్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి రాడో స్లావ్ తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రెండు దేశాల మధ్య పలు కీలక అంశాలపై చర్చించారు. భారత్ ఎప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతుందని భారత్ తో స్నేహం కోరుకునే దేశాలు కూడా ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరి విడనాడాలని స్పష్టం చేశారు. గతేడాది పాక్ పర్యటనకు వెళ్లిన పోలాండ్ విదేశాంగ మంత్రి జమ్మూ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలకు జై శంకర్ కౌంటర్ ఇచ్చారు. బోర్డర్ ఉగ్రవాదంతో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు రాడో స్లావ్ కు తెలుసని జై శంకర్ అన్నారు. దానిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి కానీ ఆజ్యం పోయకూడదని చురకలంటించారు. ఉగ్రవాదం ప్రపంచ దేశాలకు ముప్పని జై శంకర్ పునరుద్ఘాటించారు. భారత్-పోలాండ్ బైలేటరల్ రిలేషన్స్ పటిష్టంగానే ముందుకుసాగుతున్నాయని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తో కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా రాడో స్లావ్ అన్నారు. ఇరు దేశాల ఆర్థిక, సాంకేతిక, రక్షణ, గనుల తవ్వకం, ప్రజల మధ్య సంబంధాలు (P2P) మరియు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చించినట్లు తెలిపారు. భారత్-ఈయూ (EU) మధ్య బలమైన సంబంధాలకు పోలాండ్ అందిస్తున్న మద్దతును అభినందించారు.