ఒక కుక్క కరిస్తే వందల కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారని, మరి ఒక్క మగాడు అత్యాచారానికి పాల్పడితే అందరు మగాళ్లు రేపిస్టులు, హంతకులు అవుతారా? అని ఆమె ప్రశ్నించారు. కుక్క కాటు కారణంగా మనిషి చనిపోతే స్పందించే వ్యవస్థలు రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలపై ఎందుకు స్పందించడం లేదని నటి రేణు దేశాయ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో ప్రముఖ యాంకర్ రష్మితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లోకి రాబోతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ప్రధానంగా ఆమె వీధి కుక్కలను చంపడంపై తీవ్రంగా స్పందించారు. సమాజంలో చిన్నారులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ వందల కుక్కలను చంపడంపై స్పందించారు. కుక్క, ఆవు, గేదె, పిల్లి, కోతి ఇవన్నీ ప్రాణులు కాదా అని నిలదీశారు. వీధి కుక్కల సంఖ్య పెరగడానికి కారణం మన చుట్టూ ఉన్న అపరిశుభ్ర పరిస్థితులేనని అన్నారు. నిద్ర లేచిన దగ్గరి నుంచి కాలభైరవుడిని పూజిస్తారని, మరోవైపు కుక్కలను చంపుతారని ఆక్షేపించారు. ఒక్కరు అత్యాచారానికి పాల్పడితే మగవాళ్లందరినీ జైల్లో పెట్టడం లేదు కదా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను ఇంత గట్టిగా మాట్లాడినందుకు తనను జైల్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చని అన్నారు. యాక్సిడెంట్ల కారణంగా రోజుకు వందల సంఖ్యలో కుక్కలు గాయపడుతున్నాయని, అవి ఎవరి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నాయని ప్రశ్నించారు.