రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే దీనిని ఆమోదించడం గమనార్హం. ప్రతిపక్షాల తీవ్ర నిరసనలతో ప్రధానమంత్రి ప్రసంగించకుండానే నిన్న సభ వాయిదా పడింది. ఈరోజు సభ మొదలైన తర్వాత ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ ధన్యవాద తీర్మానంలో ప్రతిపక్షాలు సూచించిన సవరణలపై స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ నిర్వహించారు. మెజార్టీ లేకపోవడంతో ఆ సవరణలను సభ నిరాకరించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని స్పీకర్ సభ్యులకు చదివి వినిపించారు. ఆ సమయంలో కూడా విపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. వారి ఆందోళనల మధ్య మూజువాణీ ఓటుతో ఈ తీర్మానాన్ని లోక్ సభ ఆమోదించింది. ఆ సమయంలో ప్రధాని సభలో లేరు. షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రం ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాని ప్రసంగించాల్సి ఉంది. అయితే, విపక్షాల నిరసనల నేపథ్యంలో ఈ ప్రసంగం లేకుండానే సభ ఈరోజుకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. లోక్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అనుమతిఇవ్వడం లేదని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఆయన వ్యాఖ్యలను అధికార పార్టీ సభ్యులు ఖండించారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు.