నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కేనని దేశ అత్యున్నత న్యాయస్థానం మహిళల ఆరోగ్యం విషయంలో నేడు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, గోప్యతా హక్కులో ఇది అంతర్భాగమని పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పాఠశాలలకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ అందించాలని, కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషను సుప్రీంకోర్టు విచారించింది. దీనిపై తాజాగా తీర్పు వెలువరించింది. అన్ని స్కూల్స్ లో విద్యార్థినులకు పర్యావరణహితమైన శానిటరీ ప్యాడ్స్ను ఉచితంగా అందించాలని ఆదేశించింది. విద్యార్థులు, విద్యార్థినులకు టాయిలెట్స్ విడివిడిగా ఉండేలా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక టాయిలెట్లు ఉండాలని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్ల ఏర్పాటు లేకపోతే.. ప్రైవేటు పాఠశాలలు గుర్తింపు కోల్పోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించింది. బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్స్, టాయిలెట్ల సౌకర్యాన్ని కల్పించడంలో విఫలమైతే గవర్నమెంట్ ను జవాబుదారీగా చేస్తామని హెచ్చరికలు చేసింది. ఈ సౌకర్యాల లేమి, పీరియడ్స్ విషయంలో ఉన్న అపోహలు బాలికల ఆరోగ్యం, విద్య, గోప్యతను ప్రభావితం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది.