నామినేషన్ పత్రాలను చించి మింగేసిన అభ్యర్థి…పుణే మున్సిపల్ ఎన్నికల్లో వింత ఘటన!

Spread the love

మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలో పుణేలో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. శివసేన పార్టీకి చెందిన ఉద్ధవ్ కాంబ్లీ అనే అభ్యర్థి, తన సొంత పార్టీకే చెందిన ప్రత్యర్థి మచ్చింద్ర ధావలే నామినేషన్ పత్రాలను (ఏబీ ఫారమ్) లాక్కొని, ముక్కలుగా చించి ఏకంగా మింగేశారు. ధంకావడి సహకార్ నగర్ వార్డు కార్యాలయంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ జరుగుతుండగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. 34వ వార్డు నుంచి పోటీ చేసేందుకు పార్టీ ఇద్దరికీ ఏబీ ఫారమ్‌లు ఇవ్వడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి, చివరకు ఇలా పత్రాలను మింగేసే స్థాయికి చేరింది.

ఈ ఘటనపై బాధితుడు మచ్చింద్ర ధావలే ఫిర్యాదు మేరకు భారతి విద్యాపీఠ్ పోలీసులు ఉద్ధవ్ కాంబ్లీపై కేసు నమోదు చేశారు. కేవలం పార్టీ అంతర్గత గొడవగానే కాకుండా, ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పనికి ఆటంకం కలిగించినందుకు కూడా ఆయనపై చర్యలు తీసుకుంటున్నారు. జనవరి 15న పుణేతో పాటు మహారాష్ట్రలోని మరో 28 నగరాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఈ ‘పేపర్ మింగుడు’ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై శివసేన అధిష్టానం కూడా సీరియస్ అయ్యింది.