సుప్రీంకోర్టు వీధి కుక్కల వివాదంపై విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్లు దాఖలవుతున్న నేపథ్యంలో కొంత అసహనం వ్యక్తం చేసింది. అందరూ కుక్కల గురించి ఆలోచిస్తున్నారు సరే మరి ఇతర జంతువుల జీవితాల సంగతేంటి? కోళ్లు, మేకల గురించి ఎందుకు మాట్లాడరు? వాటివి ప్రాణాలు కావా అని ఈ కేసులో కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ను ప్రశ్నించింది. కుక్కలు కరుస్తాయా లేదా అనే విషయాన్ని అవి దగ్గరకు వచ్చేదాకా తెలుసుకోలేమని ఈ సమస్యకు చికిత్స కంటే నివారణే ముఖ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.రోడ్లు, పాఠశాలల వద్ద కుక్కల వల్ల ప్రమాదాలు జరగడంపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్, రైల్వే స్టేషన్లు తదితర ప్రదేశాల్లో కుక్కలు కరుస్తోన్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో వీధి కుక్కలకు కాంట్రాసెప్టివ్ సర్జరీలు చేయాలని అధికారులను ఆదేశించింది. దీనిపై న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ..ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కుక్కలకు వ్యాక్సిన్లు వేయడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటి పద్ధతులతో వీధి కుక్కల సమస్య తగ్గుతోందన్నారు.