తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్.ఎన్. రవి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ సంవత్సరం అసెంబ్లీ మొదటి సమావేశం నేడు ప్రారంభం కాగా తన ప్రసంగం మధ్యలోనే ఆయన వాకౌట్ చేశారు. తమిళతల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయగీతం ఆలపించాలని స్పీకర్ ని గవర్నర్ కోరగా అందుకు అంగీకరించకపోవడంతో ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అన్ని అసెంబ్లీలలో గవర్నర్ ప్రసంగానికి ముందు, జాతీయగీతాన్ని పాడతారని, ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరినా ఉద్దేశపూర్వకంగానే నిరాకరించారని లోక్ భవన్ తెలిపింది.
తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో జాతీయగీతాన్ని పాడకుండా అవమానించి ప్రాథమిక రాజ్యాంగ విధిని పట్టించుకోలేదు. గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో మైక్ ను పదేపదే ఆపేసి ఆయనను మాట్లాడడానికి అనుమతించలేదు. అసెంబ్లీలో తరచూ జాతీయగీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్ అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వం గవర్నర్ కు ఇచ్చిన ప్రసంగ కాపీలో అసత్య, నిరాధారమైన ప్రకటనలు ఉండడంతో దానిని చదవడానికి ఆయన నిరాకరించారని అలాగే రాష్ట్రంలో దళితులపై జరుగుతోన్న దారుణాలు, మహిళలపై లైంగిక హింస వంటి సమస్యలు తీవ్రమవుతుంటే వాటి గురించి ప్రసంగ కాపీలో ఎక్కడా ప్రస్తావించలేదని లోక్ భవన్ తన ప్రకటనలో తెలిపింది.