రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందని అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి కి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని ఈరోజు బయటపెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ‘డైవర్షన్ పాలిటిక్స్’ తప్ప మరొకటి కాదని ఆక్షేపించారు. హరీష్ రావు తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడని రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక, ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. గత 24 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉంది, అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని కె.టి.ఆర్ స్పష్టం చేశారు. అయితే విచారణల పేరుతో, నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే అది భ్రమ మాత్రమేనని ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడడం ఆపేది లేదని పేర్కొన్నారు.