ప్రధాని మోదీ హవా ఇంకా తగ్గలేదని తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే బయటపెట్టింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 326 స్థానాలతో మరోసారి అధికారంలోకి వస్తుందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 185 సీట్లు లభించే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈ రాజకీయ ఆధిక్యత మధ్య యువతలో అసంతృప్తి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు యువతను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. పరీక్షల నిష్పాక్షికతపై 40 శాతం మంది యువతకు నమ్మకం లేదని సర్వే వెల్లడించింది. మరో 27 శాతం మంది పరీక్షా వ్యవస్థపై చాలా తక్కువ విశ్వాసం ఉందని చెప్పారు. దీంతో మొత్తంగా 67 శాతం మంది యువత పరీక్షల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేసినట్టయింది. కేవలం 14 శాతం మంది మాత్రమే పరీక్షా ప్రక్రియ పూర్తిగా నిష్పాక్షికంగా ఉందని విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని 17 శాతం జెన్-జీ యువత అభిప్రాయపడింది. రిక్రూట్మెంట్ వ్యవస్థ నమ్మదగినదిగా లేదన్న భావన కూడా యువతలో కనిపించింది. ప్రభుత్వ వైఫల్యాల గురించి అడిగినప్పుడు రిగ్గింగ్, అవినీతిని అడ్డుకోవడంలో వైఫల్యాన్ని 9.8 శాతం మంది ప్రధాన కారణంగా తెలిపారు. గత సర్వేలో ఇదే అభిప్రాయం కేవలం 1.4 శాతంగా ఉండటం గమనించదగ్గ పరిణామం. అంటే యువత అసంతృప్తి ఇప్పుడు కేవలం పరీక్షల వరకే పరిమితం కాలేదని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు రాజకీయ హామీల కంటే అవకాశాలే కీలకంగా మారుతున్నాయి.
దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగాన్ని 22.7 శాతం మంది ముందంజలో ఉంచారు. నిరుద్యోగ పరిస్థితి చాలా తీవ్రమైందని 42.3 శాతం మంది అభిప్రాయపడ్డారు.మరో 23.8 శాతం మంది పరిస్థితిని తీవ్రమైనదిగా పేర్కొన్నారు. అంటే ఉద్యోగ అవకాశాల కొరత యువతలో ఎంతటి ఆందోళనను కలిగిస్తోందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో ద్రవ్యోల్బణమే అతిపెద్ద వైఫల్యమని 23 శాతం మంది అభిప్రాయపడ్డారు. 15.9 శాతం మంది నిరుద్యోగాన్ని ప్రభుత్వ ప్రధాన వైఫల్యంగా గుర్తించారు. ఇక పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా, విద్యా రంగం కోసం, జెన్-జీ తరఫున పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి సర్వేలో ఆశించిన స్థాయిలో మద్దతు కనిపించలేదు. 39 శాతం మంది ఆ సంస్థ రాజకీయ పార్టీగా మారకుండా ఒత్తిడి సమూహంగానే పనిచేయాలని అభిప్రాయపడ్డారు. సీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటు వేయబోమని 43 శాతం మంది స్పష్టం చేశారు. అయితే 33 శాతం మంది మాత్రం ఆ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యువతలో అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యక్తిగత ఆదరణ మాత్రం తగ్గలేదనేది స్పష్టమవుతోంది. తదుపరి ప్రధానమంత్రిగా మోదీనే ఎంపిక చేస్తామని 48.7 శాతం మంది ప్రజలు తెలిపారు. రాహుల్ గాంధీ 27.1 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. ప్రధానమంత్రి వ్యక్తిగత పనితీరుకు 51.3 శాతం మంది మద్దతు పలకడం ఆయన హవా ఏమేరకు ఉందో అర్ధమవుతోంది. యూనిఫామ్ సివిల్ కోడ్‌కు 75 శాతం మంది మద్దతు తెలిపారు. చొరబాట్ల నియంత్రణకు 76.2 శాతం మంది అనుకూలంగా స్పందించారు.
ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానానికి 70.4 శాతం మంది సమర్ధించారు. కఠినమైన ఫిరాయింపుల నిరోధక చట్టానికి 64.4 శాతం మంది మద్దతిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అనే లక్ష్యంపై 57.6 శాతం మంది ఉత్సాహంగా ఉన్నట్లు సర్వే తెలిపింది. ఎన్డీయే ప్రభుత్వ మొత్తం పనితీరుపై 50.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అంటే పాలనపై కొన్ని రంగాల్లో విమర్శలు ఉన్నప్పటికీ మోదీ నాయకత్వంపై వ్యక్తిగత విశ్వాసం మాత్రం బలంగానే ఉంది. యువతకు ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత వంటి అంశాలు కీలకంగా మారినా జాతీయ స్థాయి నాయకత్వ విషయంలో మోదీనే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్డీయేకు అనుకూలమైన అంశాలతో పాటు సవాళ్లను కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే స్పష్టంగా చూపించింది. దేశ ప్రజాస్వామ్య పరిస్థితి ప్రమాదంలో ఉందని 46.7 శాతం మంది భావించగా..41.6 శాతం మంది ఈ అభిప్రాయంతో విభేదించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై 40.9 శాతం మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి సంబంధించిన కీలక సంకేతంగా కనిపిస్తోంది. అయోధ్య రామ మందిరంలో జరిగిన దొంగతనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసిందని 46.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. అదే సమయంలో E20 పెట్రోల్ మార్పులకు 58 శాతం మంది మద్దతు తెలిపారు. యువత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలన్న అవసరం కూడా ఈ సర్వే ద్వారా కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఉద్యోగ నియామకాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై నమ్మకం పెంచాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం రాబోయే కాలంలో రాజకీయ పార్టీలకు కీలక సవాలుగా మారనుంది. మొత్తంగా చూస్తే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే భారత రాజకీయాల్లో ఒకేసారి రెండు భిన్నమైన ధోరణులను ప్రతిబింబిస్తోంది. ఒకవైపు ఎన్డీయేకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టే స్థాయిలో ప్రజా మద్దతు కనిపిస్తోంది. మరోవైపు యువతలో ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, ధరల పెరుగుదలపై తీవ్ర అసంతృప్తి ఉందనేది కనిపిస్తోంది. ఇక రాహుల్ గాంధీతో పోలిస్తే మోదీకి తదుపరి ప్రధానమంత్రిగా ఎక్కువ మంది మద్దతు తెలిపారు. సీజేపీ విషయంలో వచ్చిన స్పందనలు కూడా ప్రజలు ఉద్యమాలను వెంటనే రాజకీయ పార్టీలుగా చూడడం లేదనే అంశాన్ని బలపరుస్తున్నట్లే కనిపిస్తోంది. అంటే సమస్యలపై ఆందోళనకు మద్దతు ఉన్నప్పటికీ దానిని ఎన్నికల ప్రత్యామ్నాయంగా చూసేందుకు అందరూ సిద్ధంగా లేరని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ సర్వే చూసుకుంటే ప్రజల్లో నాయకత్వంపై నమ్మకం ఉంది అయితే కొన్ని సమస్యల పరిష్కారంపై మాత్రం మరింత వేగం అవసరమనే అభిప్రాయం కనిపిస్తోంది. రేపటి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి యువత చేతుల్లోనే ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి.