‘జననాయగన్’ చిత్రాన్ని అడ్డుకోవాలనే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రయత్నం తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. మిస్టర్ మోదీ, తమిళ ప్రజల గొంతుకను అణచివేయడంలో మీరు ఎప్పటికీ విజయం సాధించలేరని తన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళ నటుడు విజయ్ నటించిన ‘జన నాయాగన్’ చిత్రానికి సంబంధించి సెన్సార్ వివాదం నడుస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో రాహుల్ స్పందించారు. హెచ్.వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ గత వారం ఆదేశాలిచ్చింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీ.బీ.ఎఫ్.సీ మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. కేసు విచారణకు స్వీకరించిన కోర్టు సెన్సార్ సర్టిఫికెట్ జారీ పై తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 21కు వాయిదా వేసింది. నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.