అంతర్జాతీయ వేదికలపై మన షట్లర్లు అసాధారణ ప్రతిభతో దూసుకుపోతూ సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు కొన్ని దేశాలకే పరిమితమైన ఈ ఆటలో, ఇప్పుడు భారత ఆటగాళ్లు ప్రపంచ స్థాయి టోర్నమెంట్లలో టాప్ సీడ్స్‌కు గట్టి పోటీనిస్తూ చెలరేగుతున్నారు. భారత్‌ను బ్యాడ్మింటన్ పవర్ హౌస్ గా మారుస్తున్నారు. వారి దూకుడు, స్ట్రాటెజిక్ మూమెంట్స్ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. థాయ్ లాండ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత షట్లర్ల హవా కొనసాగుతోంది. మెన్స్ సింగిల్స్ విభాగంలో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్ విభాగంలో స్టార్ షట్లర్ సింధు, పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్ చేరారు. ప్రి క్వార్టర్స్ లో సింధు 21-13, 21-15తో డెన్మార్క్ కు చెందిన అమలీ షుజ్ పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్స్ లో లక్ష్య సేన్ 21-12, 21-13తో చైనాకు చెందిన షువాన్ చెన్ పై గెలిచాడు. పురుషుల డబుల్స్ లో సాత్విక్-చిరాగ్ జోడీ మలేషియాకు చెందిన బ్రయాన్ జెరెమీ-మహమ్మద్ హైకాల్ పై గెలిచారు. ఇక క్వార్టర్స్ లో జపాన్ కు చెందిన అకానె యమగూచితో సింధు,థాయ్ లాండ్ కు చెందిన కున్లావుత్ వితిద్సర్న్ తో లక్ష్యసేన్, జపాన్ కు చెందిన జోడీ తకుమి నొముర- యుచి షిమోగమి తో సాత్విక్- చిరాగ్ ఆడనున్నారు.