ఇంటర్నేషనల్ క్రికెట్ లో బంగ్లాదేశ్ కు గట్టి దెబ్బ తగిలింది. ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల పేరు చెప్పి భారత్ లో పర్యటించేందుకు విముఖత వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ను 2026 వరల్డ్ కప్ నుంచి తీసివేసింది. ఫిబ్రవరిలో మొదలయ్యే టీ20 ప్రపంచకప్ 2026 నుంచి బంగ్లాదేశ్ జట్టును అధికారికంగా తొలగిస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నమెంట్‌లోకి తీసుకుంటున్నట్లు నేడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు ఐసీసీ లేఖ ద్వారా తెలియజేసింది. 2007 నుంచి ప్రతి టీ20 ప్రపంచకప్‌లోనూ ఆడిన బంగ్లాదేశ్ ఈసారి మాత్రం ఐసీసీ కఠిన నిర్ణయంతో బ్రేక్ పడింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి భారత్ లో తమ ఆటగాళ్ల భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా బంగ్లాదేశ్ ఈ టోర్నీకి దూరమైంది. ఈ మార్పుతో స్కాట్లాండ్ జట్టు నేరుగా గ్రూప్ సిలో ప్రవేశించింది. ఈ గ్రూప్‌లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్ వంటి జట్లు ఉన్నాయి. స్కాట్లాండ్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న కోల్‌కతా వేదికగా వెస్టిండీస్ తో ఆడనుంది. ఆ తర్వాత ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్‌తో ఆ జట్టు మ్యాచ్ లు ఉన్నాయి. స్కాట్లాండ్ ఇప్పటివరకు ఐదు టీ20 ప్రపంచకప్‌లలో పాల్గొంది. గత రెండు టోర్నీల్లో సూపర్ 8 దశకు చేరుకోలేకపోయినా, పెద్ద జట్లకు గట్టి పోటీనిచ్చింది.